Loading...
UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్‌కు అధికారుల సీల్
స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్‌కు అధికారుల సీల్

UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్‌కు అధికారుల సీల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ విద్యార్థినులతో బుర్ఖాలు ధరింపజేసి నృత్యం చేయించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈవ్యవహారంపై తీవ్ర చర్చ జరగడంతో అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. గోండా జిల్లా బాబన్‌జోత్ ప్రాంతంలోని ఔసానీ బుజుర్గ్ వద్ద ఈప్రైవేట్ స్కూల్ ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినులతో బుర్ఖాలు ధరింపజేసి డాన్స్ చేయించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈవీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. వీడియోపై స్పందించిన జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి అమిత్ కుమార్ సింగ్ పాఠశాలపై విచారణకు ఆదేశించారు.

వివరాలు 

పాఠశాలపై విచారణకు ఆదేశించిన జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి

అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆ స్కూల్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదని తేలింది.

అంతేకాకుండా, పాఠశాల కార్యకలాపాలను నిలిపివేయాలని వారం రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా విద్యాసంస్థను కొనసాగిస్తున్నట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)రియాజ్ అహ్మద్ వెల్లడించారు.

దీంతో నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్, మేనేజర్ గదులతో పాటు ప్రధాన గేటుకు కూడా అధికారులు సీల్ వేశారు.

ఇక గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ప్రక్రియ కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న 'బుర్ఖా డాన్స్' వీడియో ఇదే.. 

ADVERTISEMENT