Sankranti Effect: సంక్రాంతి పండగ కోసం పల్లెబాట.. టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లేందుకు పట్టణాల్లోని ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ గ్రామాలకు చేరుకోగా, మరికొందరు ప్రయాణంలో ఉన్నారు.
పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు జనవరి 11 నుండి 19 వరకు సెలవులు ప్రకటించాయి.
జనవరి 20న తరగతులు పునఃప్రారంభం కానున్నందున, స్కూల్స్, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు.
బస్సుల్లో సీట్లు లభించకపోవడంతో, చాలా మంది నిలబడి ప్రయాణం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన బస్ స్టాప్‌ల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు.
Details
ట్రాఫిక్‌ను క్లియర్ చేేసేందుకు రంగంలోకి దిగిన నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్
బస్సులు రాగానే సీట్ల కోసం ఎగబడుతున్నారు. మరోవైపు సొంత వాహనాలు కలిగిన వారు కుటుంబాలతో కలిసి కార్లు, మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలంలోని పంతంగి, కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ రంగంలోకి దిగింది.
నగరంలోని అమీర్‌పేట్, కూకట్‌పల్లి, పెద్ద అంబర్ పేట్, ఆరాంఘార్ చౌరస్తాలో కూడా ట్రాఫిక్ జాం ఏర్పడినట్లు సమాచారం. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.