Loading...
DK Shivakumar: 'వందేమాతరం'పై డీకే శివకుమార్‌ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం
'వందేమాతరం'పై డీకే శివకుమార్‌ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం

DK Shivakumar: 'వందేమాతరం'పై డీకే శివకుమార్‌ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారమే తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని తెలిపారు. ఈ అంశంలో పార్టీ నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 'వందేమాతరం'లోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడంపై శివకుమార్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. తనకు తెలియకుండానే ఆ నిర్ణయం జరిగి ఉండొచ్చని చెప్పారు. అయితే ఇకపై కర్ణాటకలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో నిర్ణయించిన విధంగానే తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు.

వివరాలు 

1937లో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ మరోసారి మద్దతు

'వందేమాతరం' ఆలాపనకు సంబంధించి 1937లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఇటీవల మరోసారి సమర్థించింది.

బహిరంగ సభలు, జాతీయ కార్యక్రమాల్లో గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని అప్పట్లో నిర్ణయించినట్లు పేర్కొంది.

మొత్తం చరణాలను ఆలపించాలనే ఉద్దేశంతో కొత్త 'వందేమాతరం' బిల్లు తీసుకురావాలన్న అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది.

వివరాలు 

కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు

కాంగ్రెస్‌ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. జాతీయ గేయాన్ని అవమానిస్తున్నారని ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు చేసింది.

భిన్నత్వాన్ని గౌరవించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం: శివకుమార్‌

బీజేపీ విమర్శలపై డీకే శివకుమార్‌ స్పందించారు. భారత్‌ అనేది భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలతో కూడిన దేశమని పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి వర్గాన్ని గౌరవించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని చెప్పారు. అదే సమయంలో బీజేపీనే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

తొలి రెండు చరణాలకే ఎందుకు పరిమితం?

'వందేమాతరం'లోని తరువాతి చరణాల్లో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉంటుందని కాంగ్రెస్‌ చెబుతోంది.

ఈ ప్రస్తావనలు ఇతర వర్గాలకు అభ్యంతరకరంగా అనిపించే అవకాశం ఉందన్న కారణంతో గేయంలోని తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

కాంగ్రెస్‌ తీసుకున్న ఇదే నిర్ణయాన్ని కర్ణాటకలోనూ అమలు చేస్తామని సీఎం డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT