కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం ప్రక్రియపై న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయమూర్తులను నియమించే సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కిరెన్ రిజిజు లేఖ కూడా రాశారు. వీరి వ్యవహార శైలిపై 2021లో పదవీ విరమణ చేసే వరకు సుప్రీంకోర్టు కొలీజియంలో భాగంగా ఉన్న జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ స్పందించారు.
కొలీజియం వ్యవస్థను బలపర్చాలి: నారిమన్
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించడం న్యాయశాఖ మంత్రిగా తన విధి అని జస్టిస్ నారిమన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి తెలుసుకోవాల్సిన రెండు ప్రాథమిక సూత్రాలు గురించి ఆయన చెప్పారు. న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేసిన 30రోజుల్లోనే న్యాయశాఖ మంత్రి స్పందించాలని నారిమన్ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో స్పందించకుంటే, ప్రభుత్వం చెప్పేదేమీ లేదని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు కొందరికే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. అవసరమైతే కొలీజియం వ్యవస్థను బలపరిచేందుకు చర్యలు తీసుకోవాలి కానీ, దాన్ని తొలగించే ప్రయత్నం చేయొద్దన్నారు.