సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు
న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తులను నియమించే సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. హైకోర్టు కొలీజియంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని కూడా రిజిజు సూచించారు. నియామక ప్యానెల్ పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రిజిజు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొలీజియం వ్యవస్థపై ఇటీవల న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు బహిరంగంగానే ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా బదులిచ్చింది.
కొలీజియం నచ్చకపోతే మరో వ్యవస్థను తీసుకురండి: సుప్రీంకోర్టు
కోర్టుల్లో కేసులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. న్యాయమూర్తల కొరత వల్లే ఈ సమస్య తలెత్తుతుందని సుప్రీంకోర్టు చెబుతోంది. కొలీజయ సిఫార్సు చేసిన పేర్ల ఎంపిక విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని సుప్రీంకోర్టు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కేంద్రం గట్టిగా వాదిస్తోంది. దీన్ని సుప్రీకోర్టు వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా.. కొలీజియంపై సంచలన వాఖ్యలు చేసారు. 2014లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్( ఎన్‌జేఏసీ)ని రద్దు చేసి ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ అధికారాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఆయన విమర్శించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం నచ్చకపోతే.. మరో వ్యవస్థను తీసుకురావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.