Gautam Gambhir : సంజూ శాంసన్ ఇన్నింగ్స్ గొప్పదే కానీ.. ఆ 8 పరుగులే మ్యాచును తిప్పాయి : గౌతమ్ గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌పై జరిగిన కీలక పోరులో విజయం సాధించిన భారత జట్టు, లక్ష్యఛేదనలో ఆత్మవిశ్వాసాన్ని చాటింది. 196 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన అడ్డాగా నిలిచాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలుపు దిశగా నడిపించాడు. అతని కీలక ప్రదర్శనకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్న చిన్న భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని వివరించాడు. 19వ ఓవర్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, ఆ దశలో జట్టు ఎదుర్కొన్న ఒత్తిడిని గుర్తు చేశాడు.
Details
చిన్న సహకారాలే మ్యాచును గెలిపిస్తాయి
ఆ ఓవర్‌లో మొదటి బంతి డాట్ కాగా, రెండో బంతికి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. దాంతో భారత్ విజయ సమీకరణం 10 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శివం దూబే కీలకంగా వ్యవహరించాడు. రెండు వరుస బౌండరీలు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. ఆ రెండు ఫోర్లు సంజూ శాంసన్‌పై ఉన్న ఒత్తిడిని గణనీయంగా తగ్గించాయని గంభీర్ విశ్లేషించాడు. క్రికెట్ అనేది జట్టు ఆట. చిన్న చిన్న సహకారాలే మ్యాచ్‌లను గెలిపిస్తాయి. శివమ్ దూబె కొట్టిన ఆ రెండు బౌండరీలు, సంజూ చేసిన 97 పరుగులంతే విలువైనవి. అవి లేకపోయి ఉంటే ఈరోజు మనం సంజూ గురించి ఇలా మాట్లాడుకునే వాళ్లం కాదని ఆయన వ్యాఖ్యానించాడు.
Details
చిన్న ఇన్నింగ్స్ లు మ్యాచులు గమనాన్ని మార్చగలవు
పెద్ద ఇన్నింగ్స్‌లు ప్రత్యేక గుర్తింపు పొందుతాయని అంగీకరించిన గంభీర్, అయితే చిన్న ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌ల గమనాన్ని మార్చగలవని స్పష్టం చేశాడు. సంజూ శాంసన్ ప్రపంచ స్థాయి ఆటగాడని, జట్టుకు అవసరమైన సమయంలో ముందుకొచ్చే సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో సంజూ కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడని గుర్తుచేసిన గంభీర్, కొన్నిసార్లు ఆటగాడికి విరామం ఇవ్వడం కూడా అవసరమని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడం కోచ్‌గా తమ బాధ్యత అని తెలిపాడు. ప్రపంచకప్ వంటి అత్యంత కీలక వేదికల్లో సంజూ రాణిస్తాడనే విశ్వాసం తనకు ఉందని, ఈ మ్యాచ్‌లో అది చేసి చూపించాడని గంభీర్ పేర్కొన్నాడు.