LOADING...
GST: ఫిబ్రవరిలో నికర జీఎస్టీ ఆదాయం రూ.3,061 కోట్లు.. ఫలితాలిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ చర్యలు
ఫలితాలిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ చర్యలు

GST: ఫిబ్రవరిలో నికర జీఎస్టీ ఆదాయం రూ.3,061 కోట్లు.. ఫలితాలిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదు అయింది. ఫిబ్రవరి నెలలో నికర జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది.జీఎస్టీ అమలు ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి నెలలను పరిశీలిస్తే... ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన వసూళ్లే ఇప్పటివరకు అత్యధికంగా నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రానికి నికర జీఎస్టీగా రూ.3,061 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలలో రూ.2,902 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఈసారి రూ.159 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. ప్రధాన అవసరాల సరుకులు, వినియోగ వస్తువులు,ఔషధాలు,సిమెంట్‌పై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ,జీఎస్టీ 2.0 సంస్కరణల కింద జీవిత బీమా,ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చినా నికర వసూళ్లలో పెరుగుదల కనిపించడం విశేషం.

వివరాలు 

2026 ఫిబ్రవరిలో నికర జీఎస్టీ

పన్ను రేట్ల సవరణలు, వ్యూహాత్మక చర్యలు, మెరుగైన విధానాల అమలుతో వినియోగం పెరగడం రాష్ట్ర ఆదాయానికి ఊతమిచ్చిందని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్‌ బాబు.ఎ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వరుసగా 11 నెలలుగా జీఎస్టీ నికర వసూళ్లు అధికంగా నమోదవుతున్నాయి. వివిధ వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, 2025 ఫిబ్రవరితో పోలిస్తే 2026 ఫిబ్రవరిలో నెట్‌ జీఎస్టీ వసూళ్లు 5.45 శాతం పెరిగాయి. ప్రతినెలా సగటున 5.86 శాతం క్యుమిలేటివ్‌ వృద్ధితో 2025-26 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది.

వివరాలు 

స్వల్పంగా తగ్గిన స్థూల జీఎస్టీ

పన్ను రేట్ల తగ్గింపు, అలాగే పొగాకు, మద్యం, విలాస వస్తువులు మినహా ఇతర వస్తువులపై సెస్సు మినహాయింపుల అనంతరం 2026 ఫిబ్రవరిలో గ్రాస్‌ జీఎస్టీగా రూ.3,562 కోట్లు వసూలయ్యాయి. 2025 ఫిబ్రవరిలో ఈ మొత్తం రూ.3,569 కోట్లు ఉంది. ఈ మేరకు స్థూల వసూళ్లలో 0.22 శాతం స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు స్థిరంగా ఉండడమే కాకుండా, సగటు కంటే మెరుగైన వృద్ధిని చూపుతున్నాయి.

Advertisement

వివరాలు 

గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే..

ఎస్‌జీఎస్టీ వసూళ్లు 2.96 శాతం పెరిగి రూ.1,251 కోట్లకు చేరాయి. కేంద్రం నుంచి ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ 7.27 శాతం పెరిగి రూ.122.21 కోట్లు అధికంగా లభించాయి. మొత్తం సెటిల్‌మెంట్‌ రూ.1,809.85 కోట్లు. పెట్రోలియం వ్యాట్‌ ఆదాయం రూ.1,442 కోట్లకు పెరిగింది. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ వసూళ్లు 31.97 శాతం పెరిగాయి. వాణిజ్య పన్నుల శాఖ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ గుర్తింపులో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కింద కేంద్రం నుంచి వచ్చే మొత్తం పెరిగింది. గతంలో తగ్గుముఖం పట్టిన జీఎస్టీ వసూళ్లను నియంత్రించడమే కాకుండా, 2026 ఫిబ్రవరిలో 4.63 శాతం వృద్ధిని నమోదు చేశారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం క్యుమిలేటివ్‌ వృద్ధి 4.77 శాతంగా ఉంది.

Advertisement

వివరాలు 

వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు

ఫిబ్రవరి నెలలో అన్ని సెక్టార్ల నుంచి కలిపి రూ.4,634 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.4,428 కోట్లు వచ్చాయి. మొత్తం సెక్టార్లలో కలిపి ఆదాయ వృద్ధి రేటు 4.63 శాతంగా నమోదైంది. పన్ను ఎగవేతపై కట్టుదిట్టమైన చర్యలు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌లపై నిబంధనల కఠినతరం. అంతర్‌రాష్ట్ర లావాదేవీలకు సంబంధించిన రిటర్న్‌ ఫైలింగ్‌లలో వ్యత్యాసాలను గుర్తించేందుకు డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు వినియోగం. ఆడిట్‌లు, దర్యాప్తులు వేగంగా పూర్తి చేయడం. అంతర్‌రాష్ట్ర లావాదేవీలను గుర్తించి ఐజీఎస్టీ చెల్లింపులు జరిగేలా చర్యలు. వ్యాపారులు నిర్ణీత గడువులోగా కచ్చితమైన వివరాలతో రిటర్న్‌లు దాఖలు చేసేలా ప్రోత్సహించడం.

వివరాలు 

వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు

పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి చురుకైన విధానాలు అమలు చేయడం. ఈ చర్యల ఫలితంగానే రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement