2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే..
2022లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా అనేక తీర్పులను వెలువరించింది. అయితే అందులోని 5 చరిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఇంటిపేరును నిర్ణయించే హక్కు: కన్నబిడ్డ ఇంటిపేరును నిర్ణయించే హక్కు తల్లికే ఉంటుందని ఈ ఏడాది జూలై 29న అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. పిల్లల ఇంటిపేరు విషయంలో తల్లి ప్రమేయాన్ని తగ్గిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పెళ్లికాని స్త్రీలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు: పెళ్లి కాని మహిళలు సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు అర్హులేనని ఈఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) నిబంధనల నుంచి పెళ్లికాని మహిళలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.
వైవాహిక అత్యాచారం నేరమే
వైవాహిక అత్యాచారం నేరమే అని ఈఏడాది సెప్టెంబరు 29న సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనిపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొంది. 83శాతంమంది వివాహితలు.. తమ భర్తల చేతిలో లైంగిక హింసకు గురవుతున్నట్లు 2019-2021 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేగణాంకాలు చెబుతున్నాయి. 'రెండు వేళ్ల పరీక్ష'పై నిషేధం: అత్యాచార బాధితులను నిర్ధారించడానికి కొనసాగిస్తున్న 'రెండువేళ్ల పరీక్ష'ను అక్టోబరు 31న సుప్రీంకోర్టు నిషేధించింది. దానికి శాస్త్రీయ ఆధారం లేదని ఈసందర్భంగా పేర్కొంది. ఇంటినిర్మాణానికి డబ్బులు అడిగినా వరకట్న వేధింపే: ఇంటి నిర్మాణంకోసం భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి తెచ్చినా.. అది వరకట్న వేధింపు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈవిషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.