GST collections: ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లలో 8.1% వృద్ధి.. తెలంగాణ 14%, ఏపీలో 5% వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మొత్తం వసూళ్లు 8.1 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దేశమంతటా ఫిబ్రవరిలో రూ.1,83,609 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.1,69,779 కోట్లతో పోలిస్తే ఇది 8.1శాతం అధికం. రీఫండ్లు చెల్లించిన తర్వాత నికర వసూళ్లు రూ.1,61,278 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే నికర వసూళ్లలో 7.9శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే,తెలంగాణలో వృద్ధి మరింత స్పష్టంగా కనిపించింది. ఫిబ్రవరిలో రాష్ట్రానికి రూ.4,125 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.3,619 కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల.
వివరాలు
అన్ని రాష్ట్రాల సగటు 6 శాతం వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వసూళ్లు పెరిగాయి కానీ వృద్ధి శాతం తక్కువగానే ఉంది. ఫిబ్రవరిలో రాష్ట్రానికి రూ.3,061 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.2,902 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి 11 నెలల్లో ఎస్‌జీఎస్‌టీ సెటిల్‌మెంట్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రూ.31,178 కోట్లు, తెలంగాణకు రూ.42,182 కోట్ల ఆదాయం లభించింది. ఈ కాలంలో ఏపీ 3 శాతం, తెలంగాణ 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, ఈ వృద్ధి రేట్లు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి సగటున 6 శాతం వృద్ధి సాధించాయి.