50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన కూడిన ధర్మాసనం విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 50,000 మందిని రాత్రికి రాత్రే నిర్వాసితులను చేయలేమని చెప్పింది. రైల్వే భూముల్లో ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారని పేర్కొన్న ధర్మాసనం.. సమస్యను మానవ కోణంతో ముడిపడి ఉన్నందని చెప్పింది. అందుకే.. వారికి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
రాష్ట్రంలో రాజకీయ యుద్ధం
హల్ద్వానీలో 29 ఎకరాల రైల్వే భూమిలోని ఆక్రమణలను తొలగించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పు.. రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి దారితీసింది. స్థానిక ప్రజలతో పాటు, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీలు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హల్ద్వానీలో రైల్వే భూమిల్లో అనుమతులు లేకుండా దశబ్దాలు 50వేల మంది నివసిస్తున్నారు. 4వేలపైగా ఇళ్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, మసీదులు, దేవాలయాలను అక్కడ నిర్మించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని 2013లో ఉత్తరాఖండ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022లో దీనిపై తీర్పు ఇవ్వగా.. ప్రతివాదులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.