AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఈసారి సుమారు రూ.3.48లక్షల కోట్ల పరిమాణంలో బడ్జెట్ ఉండే అవకాశమున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం అనంతరం ఉదయం 11.15గంటలకు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టగా, శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భం.
Details
ఇవాళ ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్
ఇప్పటికే ఒకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తును పూర్తిచేసిన ఆయన, ఇవాళ ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరే విధంగా ప్రతిపాదనలు రూపొందించబడినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు 10 రోజుల ముందు నుంచే ప్రీ-బడ్జెటరీ సమావేశాలు నిర్వహించిన పయ్యావుల కేశవ్, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఇప్పటి వరకు అనుసరించిన సంప్రదాయ విధానాలకు భిన్నంగా 2026-27 బడ్జెట్ ఉండబోతుందని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంటోంది.