China: ట్రంప్ ఆరోపణలపై చైనా ఘాటు స్పందన.. 'అమెరికా ఎన్నికలతో మాకేం పని!'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా అమెరికా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందని,సుమారు 22 కోట్ల(220 మిలియన్)మంది అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరించిందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వ్యాఖ్యలకు చైనా వెంటనే స్పందిస్తూ అన్ని ఆరోపణలను పూర్తిగా ఖండించింది. వైట్‌హౌస్‌లో ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేసిన ట్రంప్, 2020 ఎన్నికల సమయంలో అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనతో అమెరికా ఎన్నికల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను "డీప్ స్టేట్"కు చెందిన కొందరు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని కూడా విమర్శించారు.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా రాయబార కార్యాలయం
ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు.
అమెరికా ఎన్నికలు పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం చైనాకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న విధానాన్నే చైనా ఎల్లప్పుడూ అనుసరిస్తోందని చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా గతంలోనూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి చర్యలకు పాల్పడదని, అందుకు తమకు ఎలాంటి అవసరం కూడా లేదని వెల్లడించారు.
వివరాలు
ఈ దేశాల నుండి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం
తన ప్రసంగంలో ట్రంప్ మరోసారి అమెరికా ఎన్నికల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సరిపోదని వ్యాఖ్యానించారు.
ప్రతి ఓటు కచ్చితంగా లెక్కించబడేలా, విదేశీ జోక్యం లేదా సైబర్ దాడులకు అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలకు సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని త్వరలోనే ప్రజలకు విడుదల చేస్తామని తెలిపారు.
వివరాలు
ఇప్పటికి లభించని న్యాయపరమైన ఆధారాలు
అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణను తప్పనిసరి చేసే SAVE Actను తక్షణమే ఆమోదించాలని ట్రంప్ కాంగ్రెస్‌ను కోరారు.
అయితే ఈ బిల్లు అమల్లోకి వస్తే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కాగా, అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.
ఇదిలా ఉండగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ట్రంప్ గతం నుంచి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటివరకు న్యాయపరమైన ఆధారాలు లభించలేదు.
ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో మోసం జరిగిందని ఏ కోర్టు కూడా నిర్ధారించలేదు.
వివరాలు
టెలివిజన్ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు
రీకౌంట్లు, ఆడిట్లు, అలాగే ట్రంప్ హయాంలో పనిచేసిన అమెరికా న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలను గుర్తించలేదని అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి.
అంతేకాకుండా, ఎన్నికల మోసానికి సంబంధించిన తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.