Loading...
India vs England: నేడు రెండో వన్డే.. భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా?
నేడు రెండో వన్డే.. భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా?

India vs England: నేడు రెండో వన్డే.. భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం విజయంతో ప్రారంభించింది. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డేలోనూ గెలిచి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం కార్డిఫ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫిట్‌నెస్‌ మాత్రమే భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాలు

గిల్‌ ఆడతాడా?

తొలి వన్డేలో 80 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మన్‌ గిల్‌.. ఇన్నింగ్స్‌ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు.

అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో కూడా అతను ఇబ్బంది పడిన తీరు గమనార్హం. దీంతో రెండో వన్డేలో అతని భాగస్వామ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.

మ్యాచ్‌ రోజునే అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఒకవేళ గిల్‌ అందుబాటులో లేకపోతే వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

వివరాలు

రోహిత్‌, కోహ్లిపై అందరి చూపు

మొదటి వన్డేలో భారత్‌ విజయం సాధించినా.. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి విఫలమవడం అభిమానులను నిరాశపరిచింది.

రోహిత్‌ 21 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా, కోహ్లి ఐదు పరుగులకే వెనుదిరిగాడు.

వారి వైఫల్యంతో భారత జట్టు ఒత్తిడిలో పడినా, కెప్టెన్‌ గిల్‌ మరియు శ్రేయస్‌ అయ్యర్‌ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకున్న రోహిత్‌, కోహ్లికి ప్రతి సిరీస్‌ కీలకమే.

యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో నిలకడగా రాణించి తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

రాహుల్‌ సహా మిగతా బ్యాటర్లపై బాధ్యత

తొలి మ్యాచ్‌లో మరో సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. రెండో వన్డేలో అతను పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది.

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ తొలి వన్డేలో విలువైన పరుగులు చేశారు.

వీరు అదే ఫామ్‌ను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

బౌలర్లకు మరో పరీక్ష

బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రా, ప్రసిద్ధ్‌, గుర్నూర్‌ బ్రార్‌ పేస్‌తో రాణించగా, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌తో మెప్పించాడు.

అయితే ప్రత్యర్థిని 100 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేసిన భారత్‌.. ఆ తర్వాత పట్టు కోల్పోవడంతో ఇంగ్లాండ్‌ దాదాపు 260 పరుగులు చేయగలిగింది.

ఈ లోపాన్ని రెండో మ్యాచ్‌లో సరిదిద్దుకోవాలని జట్టు భావిస్తోంది.

వివరాలు

సిరీస్‌ను నిలబెట్టుకునే పట్టుదలతో ఇంగ్లాండ్

టీ20 సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేలో మాత్రం తడబడింది.

ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ చేజారిపోతుండటంతో మరింత పట్టుదలతో బరిలోకి దిగనుంది.

డకెట్‌, బెతెల్‌, బట్లర్‌, బ్రూక్‌, రూట్‌, జాక్స్‌, సామ్‌ కరన్‌, డాసన్‌లతో కూడిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను తక్కువ అంచనా వేయడం కష్టం.

తొలి మ్యాచ్‌లో 107 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా, చివరికి 250కి పైగా స్కోరు చేయడం వారి బ్యాటింగ్‌ లోతుకు నిదర్శనం. బౌలింగ్‌లో ఆర్చర్‌, టంగ్‌, సామ్‌ కరన్‌, ఆదిల్‌ రషీద్‌లతో ఇంగ్లాండ్‌కు మంచి బలం ఉంది.

వివరాలు

పిచ్‌, వాతావరణం ఎలా?

కార్డిఫ్‌ పిచ్‌ సాధారణంగా పేస్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే మంచి స్కోర్లు చేసే అవకాశముంది.

ఔట్‌ఫీల్డ్‌ వేగంగా ఉండటంతో పరుగులు త్వరగా వస్తాయి. ఈ మైదానంలో లక్ష్య ఛేదన చేసే జట్లు ఎక్కువ విజయాలు నమోదు చేశాయి.

అందువల్ల టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని అంచనా.

ADVERTISEMENT