Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుడి భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో వైద్యులు ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన 'రొటేటర్ కఫ్' సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ చికిత్స కోసం ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తికాగా, గత నాలుగు రోజులుగా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
వివరాలు
ఆసుపత్రిలో పవన్ ను పరామర్శించిన చంద్రబాబు
అయితే పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు పవన్ కళ్యాణ్‌కు సూచించారు.
ఈ సమయంలో వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలని కూడా సూచించినట్లు సమాచారం.
పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి,ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఇదిలాఉండగా,పవన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వార్త వెలువడటంతో జనసేన శ్రేణులు, ఎన్డీయే కూటమి నాయకులు,అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది.
సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు.