Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడు పోర్టుల విస్తరణ కోసం అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, మూడు పోర్టుల రెండో దశ విస్తరణ కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం రూ.1,638.52 కోట్ల విడుదలకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది.
వివరాలు
పోర్టుల వారీగా నిధుల కేటాయింపు
మచిలీపట్నం పోర్టు: రెండో దశ అభివృద్ధి పనుల కోసం 1,420.70 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. ఇందుకు రూ.347 కోట్ల విడుదలకు పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.
మూలపేట పోర్టు: రెండో దశ విస్తరణలో భాగంగా 1,903.39 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.440.52 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రామాయపట్నం పోర్టు: రెండో దశ పనుల కోసం 2,924.45 ఎకరాల భూసేకరణకు రూ.851 కోట్ల విడుదలకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.