Andhra Pradesh: విద్యుత్ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.940.07 కోట్ల ట్రూడౌన్‌ను అమలు చేయాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను పరిశీలించిన అనంతరం, ఇప్పటికే అనుమతించిన ఖర్చులు, వాస్తవ వ్యయాలను సమీక్షించి ట్రూడౌన్ కింద వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో ఎంత మేర తగ్గింపు ఇవ్వాలనే అంశంపై ఏపీఈఆర్‌సీ తుది నిర్ణయం తీసుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో కూడా డిస్కంలు రూ.924 కోట్ల ట్రూడౌన్‌ను అమలు చేశాయి.
వివరాలు
కూటమి ప్రభుత్వం హామీ
ఎన్నికల సమయంలో విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం మోపబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆ హామీకి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అదనపు విద్యుత్ ఛార్జీలు విధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
దీనికి విరుద్ధంగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ట్రూఅప్, ఇంధన సర్‌ఛార్జి, విద్యుత్ సుంకం తదితరాల పేరుతో ఐదేళ్లలో మొత్తం రూ.32,166 కోట్ల భారం వినియోగదారులపై పడినట్లు పేర్కొంది.
వివరాలు
ట్రూడౌన్ లెక్కలు ఎలా ఉన్నాయి?
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు డిస్కంలు కలిపి 70,884.71 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను విక్రయించాయి.
విద్యుత్ కొనుగోలు ధర ఏపీఈఆర్‌సీ అనుమతించిన అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ) కింద వినియోగదారుల నుంచి రూ.1,918.32 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు లెక్కలు రూపొందించాయి.
అయితే, ప్రతినెలా విద్యుత్ బిల్లుల్లో యూనిట్‌కు 40 పైసల చొప్పున ఎఫ్‌పీపీసీఏ వసూలు చేయడంతో మొత్తం రూ.2,800.28 కోట్లు ఇప్పటికే వినియోగదారుల నుంచి వసూలయ్యాయి.
ఈ మొత్తం నుంచి ఎఫ్‌పీపీసీఏ కింద సర్దుబాటు చేయాల్సిన రూ.1,918.32 కోట్లు తీసివేస్తే రూ.881.96 కోట్లు మిగులుతున్నాయని డిస్కంలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి.
వివరాలు
బహిరంగ మార్కెట్ కొనుగోళ్లపై నియంత్రణ
దీనికి క్యారీయింగ్ కాస్ట్ కింద రూ.58.11 కోట్లు జతచేయడంతో మొత్తం రూ.940.07 కోట్లను ట్రూడౌన్‌గా వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదించాయి.
వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల భారం తగ్గించేందుకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను నియంత్రించింది.
అదే సమయంలో విద్యుత్ కొనుగోలు సగటు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టింది.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అంతర్గత సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఉత్పత్తిని అధికం చేయడంతో, బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం కూడా తగ్గింది.
వివరాలు
కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో సామర్థ్య పెంపు
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్లలో (ప్రతి యూనిట్ 800 మెగావాట్లు) పనితీరును మెరుగుపరచడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది.
దీని ప్రభావంతో విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా గణనీయంగా తగ్గింది. 2023-24లో యూనిట్ విద్యుత్ కొనుగోలుకు సగటున రూ.5.42 ఖర్చు కాగా, 2025-26 నాటికి అది రూ.4.90కు తగ్గినట్లు డిస్కంలు వెల్లడించాయి.
వివరాలు
రూ.20,288 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించింది
2019-24 కాలానికి సంబంధించి ట్రూఅప్ కింద రూ.4,498 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీ అనుమతి ఇచ్చినా, ఆ మొత్తాన్ని వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వమే భరించింది.
అదేవిధంగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లో చూపిన రూ.15,790 కోట్ల రెవెన్యూ లోటును కూడా ప్రభుత్వమే భరించింది.
దీంతో ఈ రెండు అంశాల కింద కలిపి మొత్తం రూ.20,288 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం స్వీకరించినట్లు వెల్లడైంది.