LOADING...
INDW vs ENGW: లార్డ్స్‌లో భారత్‌ మహిళల జట్టు ఆధిపత్యం.. చారిత్రక విజయానికి అడుగు దూరం
లార్డ్స్‌లో భారత్‌ మహిళల జట్టు ఆధిపత్యం.. చారిత్రక విజయానికి అడుగు దూరం

INDW vs ENGW: లార్డ్స్‌లో భారత్‌ మహిళల జట్టు ఆధిపత్యం.. చారిత్రక విజయానికి అడుగు దూరం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

చారిత్రక లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయానికి మరింత చేరువైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. భారత్‌ నిర్దేశించిన 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. భారత బౌలర్లలో సయాలి,క్రాంతి,స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఒక దశలో ఇంగ్లాండ్‌ 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆ సమయంలో అమీ జోన్స్‌ (52 నాటౌట్‌),మ్యాడీ విలియర్స్‌ (26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

వివరాలు 

అద్భుత సెంచరీతో చెలరేగిన యాస్తిక భాటియా

అయితే ఇంకా ఇంగ్లాండ్‌ విజయానికి భారీ లక్ష్యం మిగిలి ఉండటంతో మ్యాచ్‌పై భారత్‌ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 154/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు 341/7 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో యాస్తిక భాటియా అద్భుత సెంచరీతో చెలరేగింది. 158 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసిన ఆమె, లార్డ్స్‌ మైదానంలో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.

వివరాలు 

అర్ధశతకంతో మెరిసిన రిచా ఘోష్

వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కూడా వేగంగా ఆడి 52 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకం సాధించింది. ఆమె దూకుడు ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆధిక్యం మరింత పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 285 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత మహిళల జట్టు లార్డ్స్‌లో అరుదైన టెస్టు విజయాన్ని అందుకునే దిశగా బలమైన అడుగులు వేస్తోంది.

Advertisement