UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కనీసం ఎనిమిదేళ్లు, ప్రొఫెసర్ పోస్టుకు పదేళ్లపాటు సహాయ ఆచార్యుడిగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు, యూజీసీ నిర్ణయించిన వేతన శ్రేణి (పేస్కేల్)లోనే ఉద్యోగం చేసినట్లు నిరూపించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తమ శాలరీ స్లిప్ లేదా ఆదాయపన్ను రిటర్న్ (ఐటీఆర్) వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అనేక మంది సహాయ ఆచార్యులకు అవసరమైన అనుభవం ఉన్నప్పటికీ, వారు పనిచేస్తున్న విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన యూజీసీ వేతనాలను చెల్లించడం లేదు.
వివరాలు
ఈ పోస్టులకు అర్హత సాధిస్తున్న డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు
ప్రత్యేకించి ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులకు యూజీసీ పేస్కేల్ అమలు కావడం లేదు.
మరోవైపు కొన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సహాయ ఆచార్యులను టీచింగ్ అసిస్టెంట్ లేదా అకడమిక్ కన్సల్టెంట్ హోదాల్లో కొనసాగిస్తున్నాయి.
దీంతో వారు ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పొందలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే డిగ్రీ కళాశాలల్లో యూజీసీ వేతన శ్రేణి ప్రకారం జీతాలు పొందుతున్న అధ్యాపకులు మాత్రం ఈ పోస్టులకు అర్హత సాధిస్తున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత అధ్యాపక పోస్టుల భర్తీలో వేతన నిబంధనను తప్పించి, అభ్యర్థుల సేవా అనుభవం, బోధన, పరిశోధన వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
వివరాలు
ఈడబ్ల్యూఎస్ కోటాపై సందిగ్ధం
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు యూజీసీ పేస్కేల్‌ను తప్పనిసరి చేయడంతో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గాలు) కోటాపైనా సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
ఈ కోటాలో 10 అసోసియేట్ ప్రొఫెసర్, ఒక ప్రొఫెసర్ పోస్టు ఉన్నాయి. యూజీసీ వేతన శ్రేణి ప్రకారం సహాయ ఆచార్యుడికి ప్రారంభ దశలోనే నెలకు రూ.90వేలకుపైగా వేతనం లభిస్తుంది.
అంటే వార్షిక ఆదాయం సుమారు రూ.10.80 లక్షలకు చేరుతుంది.
ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న అధ్యాపకులకు నెలకు సుమారు రూ.1.20 లక్షల వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది.
అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
దీంతో యూజీసీ పేస్కేల్ ప్రకారం వేతనం పొందుతున్న అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రయోజనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
వివరాలు
1.90 లక్షల దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్'లోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది మే 15న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామకాలకు మొత్తం 1,90,509 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,80,423 మంది అభ్యర్థులు హార్డ్ కాపీలు సమర్పించారు.
పరిశీలన అనంతరం 1,51,862 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.
మంగళవారం రాత్రి ప్రాథమిక అర్హుల జాబితాను విడుదల చేసిన శాఖ, దానిపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది.
అనంతరం ఈ నెల 27న తుది అర్హుల జాబితాను ప్రకటించనుంది.
వివరాలు
1.90 లక్షల దరఖాస్తులు
సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలను ఆగస్టు నెలలోపు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ప్రశ్నపత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ఒక్కో పోస్టుకు 12 మందికిపైగా అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.