YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.25లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆరోగ్య శ్రీ అదనపు అదనపు ప్రయోజనాలు, కొత్త ఫీచర్లతో పేదలకు ఉచిత వైద్యం అందించే స్మార్డ్ కార్డుల పంపిణీకి కూడా వైఎస్ శ్రీకారం చుట్టారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సదుపాయాలను పొందడంపై క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్రంలోని సుమారు 4.25 కోట్ల మందికి వర్తింపజేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద సోమవారం నుంచే రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తుందని వివరించారు.
2,513 ఆసుపత్రుల్లో పేదలకు ఖరీదైన చికిత్స: జగన్
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2,513 ఆసుపత్రుల్లో పేదలకు ఖరీదైన చికిత్స అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని జగన్ సూచించారు. కొత్త పథకం ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1.48కోట్ల కుటుంబాలు, 4.25కోట్ల మంది లబ్ధిదారులకు చేరువ చేయాలన్నారు. అప్డేట్ చేసిన ఆరోగ్యశ్రీ కార్డ్‌లో QR కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, లబ్ధిదారుని ఐడీ ఉంటుంది.