ఆరోగ్యకరమైన ఆహారం: చలికాలంలో స్వీట్ పొటాటో వల్ల కలిగే ప్రయోజనాలు
స్వీట్ పొటాటో.. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు కందగడ్డ అని, కొందరు రత్నపురి గడ్డ అని అంటారు. చలికాలంలో దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తినడానికి పిండి పదార్థంలా అనిపించినప్పటికీ ఇందులో ఐరన్, ఫైబర్, పొటాషియం, సెలేనియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా విటమిన్ ఏ, బీ, సీ మొదలగునవి పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది: గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థం ఇది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. గుండె వ్యాధుల నుండి రక్షణ: ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
మానసికంగా బలహీనం కాకుండా మెదడును ఉత్తేజపరుస్తుంది స్వీట్ పొటాటో. ఇందులో ఉండే పోషకాలు మెదడును చురుగ్గా, ఉల్లాసంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బీటా కెరాటిన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. కంటిచూపును పెంచుతుంది: కంటిచూపు బాగుండాలంటే "విటమిన్ ఏ" తగినంతగా ఉండాలి. కంటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చలికాలంలో స్వీట్ పొటాటోని మీ డైట్ లో చేర్చుకోండి. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది: చాలా వ్యాధులు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్లనే వస్తాయి. ఇందులోని ఫైబర్, ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేసి, అనవసర అనారోగ్యాలను దూరం ఉంచుతాయి.