Guinness world record: 30 సెకన్లలో 195 ముద్దులు.. ప్రేమతోనే ప్రపంచ రికార్డు కొట్టిన బ్రెజిల్ ప్రేమజంట
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమను వ్యక్తపరచడానికి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రేమజంట మాత్రం తమ అనుబంధాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిపింది. కేవలం 30 సెకన్లలో 195 ముద్దులు ఇచ్చిపుచ్చుకుని కొత్త ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఘనతను సాధించడం ప్రత్యేకతను సంతరించుకుంది. బ్రెజిల్‌కు చెందిన 32 ఏళ్ల రెనాటో బేమా గియా, 33 ఏళ్ల నయారా రాబర్టా రిబీరో డి మారిన్స్ ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. అర నిమిషంలో 195 ముద్దులు ఇచ్చిపుచ్చుకుని "30 సెకన్లలో ఒక జంట ఇచ్చుకున్న అత్యధిక ముద్దులు" అనే విభాగంలో కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
వివరాలు
నెట్టింట వైరల్..
ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ధ్రువీకరించింది. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ జంటమని విశ్వసిస్తున్నందున ఈ రికార్డును కలిసి సాధించాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. వృత్తిపరంగా రెనాటో, నయారా ఇద్దరూ వైద్యులే. గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ డాక్టర్లుగా సేవలందించింది. ఇప్పుడు ఆ సేవలకు తోడు గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా తమ విజయాల జాబితాలో చేర్చుకుంది. రికార్డు సాధన సందర్భంగా విడుదలైన వీడియోలో రెనాటో తన అభిమాన ఫుట్ బాల్ జట్టు జెర్సీ ధరించి నయారా చెంపపై అత్యంత వేగంగా వరుసగా ముద్దులు పెడుతుండగా, ఆమె చిరునవ్వుతో ఆ క్షణాలను ఆస్వాదించడం కనిపించింది.
వివరాలు
టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన రెనాటో..
రెనాటోకు గిన్నిస్ రికార్డులు కొత్త విషయం కాదు. ఇప్పటికే పలు విభాగాల్లో ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. అత్యంత వేగంగా పది పుస్తకాలను వరుసగా అమర్చి కూల్చడం, పురుషుల విభాగంలో పాదాన్ని అత్యధిక కోణంలో తిప్పడం వంటి రికార్డులు కూడా అతని పేరిట ఉన్నాయి. తాజా విజయంతో బ్రెజిల్‌లో అత్యధిక గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తిగా నిలిచినట్లు రెనాటో తెలిపాడు. అలాగే తన రికార్డుల ప్రయాణంలో ప్రియురాలు నయారా పేరు కూడా చిరస్థాయిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేపట్టినట్లు వెల్లడించాడు. టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన రెనాటోకు విజయం సాధించడం ఒక అలవాటుగా మారిందని చెబుతున్నాడు.
వివరాలు
నిమిషంలో 277 ముద్దులు..
ఈ రికార్డుతోనే ఆగిపోవాలన్న ఆలోచన ఈ జంటకు లేదు. ఇప్పుడు నిమిషంలో అత్యధిక ముద్దులు ఇచ్చుకున్న ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ రికార్డు జపాన్‌కు చెందిన చెర్రీ యోషితాకే, కుమికో షిరటోరి పేరిట ఉంది. వారు ఒక నిమిషంలో 277 ముద్దులు ఇచ్చిపుచ్చుకుని ఈ ఘనతను నమోదు చేశారు. తమకు రికార్డులు కేవలం సంఖ్యల కోసం కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, పరస్పర నమ్మకం, కొత్త సవాళ్లను స్వీకరించే ధైర్యానికి గుర్తుగా ఈ విజయాలు నిలిచిపోతాయని రెనాటో, నయారా అభిప్రాయపడ్డారు.