ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది
నీలో సామర్థ్యం, తెలివి పెరగాలంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టాలి. ఏ పనిలో అయినా ప్రయత్నం లేకుండా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాలేరు. అంటే, ప్రయత్నం చేయకముందు అందరూ పరిణతి లేనివారే. చాలామంది ఈ విషయంలోనే ఇబ్బంది పడతారు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వారు, ఫైనాన్స్ రంగంలో ఎక్స్ పర్ట్ కావాలంటే ఫైనాన్స్ రంగం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాలి. దానికంటూ రోజూ కొంత సమయం కేటాయించాలి. అలాంటప్పుడే ఫైనాన్స్ రంగంలోనూ పనిచేసే సత్తా నీకు వస్తుంది. ఈ ఉదాహరణ ఏ విషయానికైనా వర్తిస్తుంది. ప్రయత్నం చేయకుండా అది మనవల్ల కాదులే అని భయపడేవాడికి విజయం ఎప్పటికీ దొరకదు. ప్రయత్నించే వాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది.
నీ ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే బాధపడకు
ప్రయత్నం చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. పనిచేయడం మాత్రం ఆపవద్దు. చినుకూ చినుకూ కలిస్తేనే సముద్రం అవుతుందని తెలుసుకున్నవాడు తన ప్రయత్నాన్ని ఎప్పటికీ మానుకోడు. ఒకవేళ నీ ప్రయత్నంలో నువ్వు ఓడిపోయావనుకో, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఓటమి అనేది నువ్వా పనిని ఎలా చేయకూడదో చెప్తుంది. అది నీకు అర్థమైనపుడు నువ్వు గెలుపు వైపు పరుగు తీస్తావు. అయినా ఓటమి నిన్నేం చేస్తుంది. మహా అయితే భాధపెడుతుంది. కన్నీరు కార్చినపుడే గుండెబలం తెలుస్తుంది. ఒక్క ఓటమిని నువ్వు తట్టుకుంటే నీ దారిలో వచ్చే ఎన్ని ఓటములనైనా నువ్వు ఎదుర్కోగలవు. ఈ విషయం తెలుసుకున్న వారెవ్వరూ ఓటమిని సీరియస్ గా తీసుకోరు.