ప్రేరణ: గెలుపు గమ్యం కాదు, ఓటమి ముగింపు కాదు, ప్రయాణమే ముఖ్యం
గెలుపు అనేది ఊరికే వచ్చేది కాదు, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. గెలుపు వచ్చింది కదా అని ఊరుకుంటే వచ్చిన గెలుపు పోవడం క్షణాలో పని. అంటే ఇక్కడ ఒక పనిలో ఒకసారి గెలవటం కాదు గెలుస్తూనే ఉండాలన్నమాట. నువ్వు ఒక గమ్యాన్ని చేరగానే మళ్ళీ కొత్త గమ్యం మొదలవుతుంది. అంటే నీ ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలైనట్టే. ఒకవేళ నువ్వు గమ్యాన్ని చేరిన తర్వాత కొత్త గెలుపు కోసం ప్రయాణం మొదలెట్టకపోతే ఓడిపోయినట్లే లెక్క. ఎందుకంటే నువ్వు సాధించిన గెలుపు ఎక్కువ రోజులు ఎవ్వరికీ గుర్తుండదు. నువ్వు గుర్తుండిపోవాలంటే గెలుపులు సాధిస్తూనే ఉండాలి. అంటే, ఇక్కడ ఓడిపోయిన వాడికన్నా, గెలిచినవాడికన్నా గెలుపో, ఓటమో తెలియకుండా ప్రయాణించే వాడే గొప్ప.
అన్నింటికన్నా ప్రయాణమే ముఖ్యం
నీకు ఓటమి ఎదురైనా కానీ నువ్వు ఆగకుండా వెళ్తూ ఉంటే ఏదో ఒకరోజు నీకు గమ్యం అందుతుంది. ఉదాహరణకు నువ్వు వేరే ఊరికి వెళ్లాలి. ఆరోజు వర్షం చాలా పడుతుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఇంట్లోంచి బయటకు వచ్చావ్, బస్టాండుకు వచ్చాక ఈరోజు బస్సులేవీ రావని తెలిసింది. బైక్ మీద వెళ్దామంటే బైక్ పంక్చర్ అయ్యింది. నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్లాలి. అప్పుడు నువ్వేం చేస్తావ్, వేరే వాళ్ళ బైక్ తీసుకుని ఊరికి వెళ్తావా? లేదంటే వర్షం ఆగేవరకు చూసి బైక్ పంక్చర్ వేయించుకుని వెళ్తావా లేదా ఊరికి వెళ్ళడమే మానేస్తావా? మూడవ ఆప్షన్ తీసుకునే వాడికి సక్సెస్ రావడం కష్టం. ఎప్పుడైనా సరే ప్రయాణం ముఖ్యం.