ప్రేరణ: గమ్యం వైపు వెళ్ళే దారి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా గమ్యాన్ని చేరుకుంటావ్
నువ్వొక బస్ ఎక్కావ్. ఆ బస్సులో అందరూ సైలెంట్ గా ఉన్నారు. బస్టాప్ రాగానే బస్సు ఆగిపోతుంది, ప్రయాణీకులు దిగిపోతున్నారు. వాళ్ళందరూ కనీసం మాట్లాడ్డం లేదు. ఒకరినొకరు చూసుకోవడం లేదు. వాళ్ళ చేతుల్లో మొబైల్స్ కూడా లేవు. వస్తున్నారు, దిగుతున్నారు. తీరా నువ్వు దిగాల్సిన బస్టాప్ వచ్చింది. నువ్వు కూడా దిగేసి వెళ్ళిపోయావు. ఈ ప్రయాణం నీకెలా అనిపించింది. అసలు బస్సు ప్రయాణం ఇంత ఘోరంగా ఉంటుందా అనిపిస్తుంది. అదే, ఆ బస్సులో నీ పక్క సీటులో ఉన్న పర్సన్ నిన్ను పలకరించాడు. అప్పుడు, అతను కుడా నువ్వు చదివే యూనివర్సిటీయే అని. నీ గ్రూపులోనే చేరుతున్నాడని తెలిసింది. దాంతో నీకేమనిపిస్తుంది.
కావాల్సింది ఉత్సాహం, కుతూహలం
పై రెండు ఉదాహరణల్లో తేడా ఏంటంటే ఉత్సాహం, కుతూహలం. అవతలి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం నిన్ను అవతలి వారితో మాట్లాడించేలా చేసింది. వాళ్ళు నువ్వు చదివే యూనివర్సిటీలోనే చదువుతున్నారని తెలిసేసరికి నీలో ఉత్సాహం పెరిగింది. ఫలితంగా బస్సు ప్రయాణం నీకు అలసటను మిగల్చకుండా చేసింది. అంటే, ఒక గమ్యంలో నీకు అలసట అనిపించకూడదంటే కాసింత కుతూహలం, కూసింత ఉత్సాహం ఉండాలి. ఈ రెండూ లేకపోతే నీకు గమ్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత గమ్యాన్నే మర్చిపోతావ్. గమ్యానికి వెళ్ళే దారిని ఇంట్రెస్టింగ్ గా మార్చుకోకపోతే జరిగే నష్టం అదే. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ప్రయాణానికి ఉత్సాహాన్ని, కుతూహలాన్ని తీసుకురావడం.