మొటిమలను పోగొట్టడం నుండి చర్మానికి మెరుపు తీసుకురావడం వరకు పసుపు చేసే ప్రయోజనాలు
పసుపును గోల్డెన్ స్పైస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారతీయ కిచెన్లలో పసుపు ప్రధాన పదార్థంగా ఉంటుంది. ఇది ఆహారానికి రంగును ఇవ్వడంతో పాటు మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో పసుపు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులోని కర్క్యుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ కారణంగా చర్మం పునరుజ్జీవం పొందుతుంది. ప్రస్తుతం పసుపు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మొటిమలను తగ్గించే పసుపు: ఒక టీ స్పూన్ పసుపు తీసుకుని దానిలో కొన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమల పైన మర్దన చేయాలి. అది ఎండిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మచ్చలను తొలగిస్తుంది
మొటిమలు పోయిన తర్వాత కొన్ని కొన్ని సార్లు మచ్చలు ఉండిపోతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి పసుపు, తేనె మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ పసుపు, మరో టీ స్పూన్ తేనె కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని మచ్చలు ఉన్న చోట మర్దన చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మచ్చలు తొలగిపోతాయి. చర్మానికి మెరుపు తీసుకొస్తుంది: ఒక టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ శనగపిండి, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ముఖము, మెడ బాగాల్లో మర్దన చేయాలి. 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.