Civil Servants Village: భారతదేశంలోని ఈ గ్రామం నుంచి 100 మందికి పైగా ఐఏఎస్లు,ఐపీఎస్లు..వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
లక్షల మంది జనాభా ఉన్న పట్టణాల నుంచి ఒకరిద్దరు సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేస్తే అదే గొప్పగా ప్రచారం జరుగుతుంది. కానీ మధ్యప్రదేశ్లో కేవలం ఐదు వేల జనాభా ఉన్న పడియాల్ అనే గ్రామంలో యువత చాలా సులభంగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పదవులు సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామం నుంచి వంద మందికిపైగా సివిల్ సర్వీస్ అధికారులు వచ్చారు. మాల్వా రీజియన్లో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వారు అందరూ గిరిజనులు. భిల్ కమ్యూనిటీకి చెందిన గిరిజనులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
చదువుకు ప్రాధాన్యం ఇచ్చే..గిరిజన కుటుంబాలు
పడియాల్ గ్రామంలో 90 శాతం మంది చదువుకున్నవారు ఉన్నారు. వీరంతా సివిల్ సర్వీస్ అధికారులే కాకుండా,అనేక ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు కూడా ఈ గ్రామానికి చెందిన వారు. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు, వైద్యులు, లాయర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఈ గ్రామం నుంచి వచ్చారు. భిల్ కమ్యూనిటీకి చెందిన వారు వైద్య పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడుగురిలో నలుగురు మెడికల్ సీట్లు సాధిస్తున్నారు. జేఈఈలో వారికి కీలక ర్యాంకులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ గ్రామం నుంచి నలుగురు మెడికల్ సీట్లు, ముగ్గురు JEE ర్యాంకులతో మంచి ఐఐటీ కాలేజీల్లో సీట్లు సంపాదించారు.
ప్రతి కుటుంబం నుంచి సగటున ఒక ప్రభుత్వ ఉద్యోగి
ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి సగటున ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రామంలోని యువత చదువుపైన ఎక్కువ దృష్టి పెట్టిందని, ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుందని వారు చెబుతున్నారు. గ్రామంలో విద్యా సంబంధిత అంశాల్లో గ్రామస్తులు చాలా చురుకుగా ఉంటున్నారు. ప్రతి విద్యార్థి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో శ్రమ పడతారు. స్కూళ్లలో స్మార్ట్ క్లాసులు కూడా జరుగుతుంటాయి. సర్వీస్ నుంచి రిటైరైన వారు గ్రామంలోని విద్యార్థుల్ని మరింతగా ఉన్నత స్థానాలకు చేరవెయ్యడంలో సహాయం అందిస్తారు.
పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు రిటైర్డ్ ఆఫీసర్ల సహకారం
విద్య, వైద్య రంగాల్లో పడియాల్ గ్రామానికి సేవ చేయడానికి పన్నెండు మంది రిటైర్డ్ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. అందరికీ కోరుకున్నట్లుగా సివిల్ సర్వీస్ రాకపోయినా, కీలక ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొంత మంది విదేశాల్లోనూ ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యువతకు సూచిస్తోంది.