Barleria Cristata Flowers: మనకి ఉన్నటే ఈ పువ్వుకి ఒక పేరుంది . . అదేంటో తెలుసా..?
చైత్ర మాసంలో పుట్టిన కారణంగా చైత్ర అని పేరు పెట్టినట్టే, కార్తిక మాసంలో జన్మించిన వారికి కార్తిక్ అని పేరు పెట్టడం మన సంప్రదాయం. ఇదే విధంగా, కొన్ని పూలకూ ప్రత్యేకమైన పేర్లు పెట్టాం. అందులో డిసెంబర్ పూలు ఒకటి. ఇవి డిసెంబర్ నెలలో పూస్తాయని ఆప్యాయంగా "డిసెంబరాలు" అంటాం. కనకాంబరాలు, నీలాంబరాల్లా వివిధ రంగులలో విరజిమ్మే ఈ పూల వెనుక ఎంతో ప్రత్యేకత ఉంది.
మంచు వాతావరణంలో ప్రకృతికి మరింత అందం
చలికాలం వచ్చే సరికి ఈ చెట్లు మారు వసంతాన్ని తెస్తాయి. చెట్టంతా పూలతో నిండిపోవడం ఒక ప్రకృతి అందం. పొడవైన ఈ పూలు అందమైన దండల రూపంలో అలంకారం చేస్తాయి. ఈ పూలకు ఆంగ్లంలో పేరు "బార్లీరియా". ఇవి తెలుపు, గులాబీ, నీలం, ఊదా, లావెండర్ వంటి రంగుల్లో ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎరుపు రంగులో కూడా పూస్తాయి. ఇవి భారత్‌తో పాటు చైనా, తైవాన్, అమెరికా, ఆఫ్రికా, అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాల్లో కనిపించవచ్చు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వీటికి పూవుల సమయం. మంచు వాతావరణంలో ప్రకృతికి మరింత అందాన్ని అందిస్తాయి.
వజ్రదంతి మొక్కల గొప్పతనం
బార్లీరియాలోని మరో ఆసక్తికర విషయమేమిటంటే, మన ప్రాంతాల్లో కనిపించే ముళ్ల గోరింట పువ్వులూ దీని కుటుంబానికి చెందినవే. ముళ్ల గోరింటను వజ్రదంతి అని కూడా పిలుస్తారు. దీని ఆకుల రసం పళ్లను బలంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రాచీనకాలం నుంచే ఆయుర్వేదంలో ప్రసిద్ధి పొందింది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలతో కలిగి ఉంది. చిగుళ్ల రక్తస్రావాన్ని ఆపడం, అల్సర్ తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
పాము, తేలు కాటుకు, ఔషధంగా..
ఇంకా, దీనిని దగ్గు, మధుమేహం వంటి వ్యాధుల నియంత్రణకు ఉపయోగిస్తారు. క్యాన్సర్ నివారణలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతారు. పాము, తేలు కాటుకు దీని వేళ్లను ఔషధంగా వాడతారు. కాళ్ల పగుళ్ల నివారణకు ఆకుల రసం ఎంతో ఉపయుక్తం. ఈ చెట్లు ప్రకృతికి అందమైన శోభను తీసుకురావడమే కాదు, సీతాకోక చిలుకల వంటి జీవులను ఆకర్షిస్తాయి. ఇవి పూలలో తేనెను ఉంచుతాయి, అందువల్లే "తేనె పూవు చెట్టు" అని కూడా పిలుస్తారు.