Loading...
AI Data Centers: ఏఐ డేటా సెంటర్ల దెబ్బకు అమెరికాలో పెరుగుతున్న కాలుష్యం
ఏఐ డేటా సెంటర్ల దెబ్బకు అమెరికాలో పెరుగుతున్న కాలుష్యం

AI Data Centers: ఏఐ డేటా సెంటర్ల దెబ్బకు అమెరికాలో పెరుగుతున్న కాలుష్యం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నుంచి భారీ స్థాయిలో డేటాను విశ్లేషించడం వరకు ఏఐ సేవలు విస్తరిస్తున్నాయి. అయితే ఈ సాంకేతిక అభివృద్ధికి మరోవైపు భారీగా విద్యుత్ అవసరమవుతోంది. ఆ విద్యుత్ కోసం గ్యాస్ ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండటంతో అమెరికాలో కాలుష్యం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని సియెర్రా క్లబ్ తాజా విశ్లేషణ హెచ్చరిస్తోంది. 15 ఏళ్లుగా సాధించిన కాలుష్య నియంత్రణ ఫలితాలు దెబ్బతినవచ్చని పేర్కొంది.

Details

2030 నాటికి 210 కోట్ల టన్నుల ఉద్గారాలు?

ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న ఏఐ ప్రాజెక్టులన్నీ అనుకున్న ప్రకారం అమల్లోకి వస్తే, 2030 నాటికి అమెరికా విద్యుత్ గ్రిడ్ నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 2.1 బిలియన్ మెట్రిక్ టన్నులకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది.

ఏఐ పరిశ్రమ, డేటా సెంటర్ల కారణంగా వచ్చే ఐదేళ్లలో ఉద్గారాలు 42 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2025తో పోలిస్తే అదనంగా 618 మిలియన్ టన్నుల కాలుష్యం వెలువడవచ్చని పేర్కొంది.

ఇప్పటికే 2025లో అమెరికా కార్బన్ ఉద్గారాలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. ఈ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయని సియెర్రా క్లబ్ వాతావరణ, ఇంధన విభాగం సలహాదారు జెరెమీ ఫిషర్ తెలిపారు.

Details

విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి.. సొంత ప్లాంట్ల వైపు కంపెనీలు

డేటా సెంటర్లకు నిరంతరం భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. అయితే ప్రస్తుత విద్యుత్ గ్రిడ్‌లో ఉన్న పరిమితుల కారణంగా కొన్ని సంస్థలు తమ కేంద్రాల వద్దే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

వీటిలో ఎక్కువగా శిలాజ ఇంధనాలైన గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన 1.2 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

మెంఫిస్ సమీపంలోని ఈ కేంద్రం కోసం మీథేన్ జనరేటర్లను వినియోగిస్తున్నారని, అవి స్థానిక అనుమతులు, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT

Details

ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకే కొత్త భారం

కొత్తగా నిర్మించనున్న డేటా సెంటర్లలో దాదాపు 70 శాతం ఇప్పటికే వాయు కాలుష్య సమస్యలున్న ప్రాంతాల్లోనే ప్రతిపాదించినట్లు విశ్లేషణ వెల్లడించింది. దీంతో అక్కడ నివసించే ప్రజలకు మరింత ఇబ్బంది కలగవచ్చు.

ఏఐ సేవలు పెరగడం సాంకేతిక రంగానికి అవకాశమే అయినా, వాటి కోసం వినియోగించే విద్యుత్ పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా అంతే ముఖ్యం.

ఈ అభివృద్ధి కొనసాగాలంటే శుభ్రమైన విద్యుత్ వనరులు, సమర్థమైన ఇంధన వినియోగంపై దృష్టి పెట్టాలి. లేదంటే ఏఐ అభివృద్ధి తెచ్చే ప్రయోజనాలతోపాటు కాలుష్య భారం కూడా పెరిగే ప్రమాదం ఉంది.

ADVERTISEMENT