China: చైనాలో ఒంటరి జీవుల వింత యాప్.. అత్యధిక డౌన్‌లోడ్‌లతో..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒంటరిగా జీవించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం ఇప్పుడు వ్యక్తిగత సమస్యను దాటి, ఒక సామాజిక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా నివసించే వారి భద్రతపై దృష్టి సారిస్తూ రూపొందించిన 'ఆర్ యూ డెడ్?' (Are You Dead?) అనే మొబైల్ యాప్ అక్కడ విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన ఈ యాప్, విడుదలైన కొద్ది కాలంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన పెయిడ్ యాప్‌గా గుర్తింపు పొందింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే లేదా అనారోగ్యం కలిగితే ఏమవుతుందనే భయాన్ని ఈ యాప్ తగ్గిస్తోంది.
వివరాలు
యూజర్ స్పందించకపోతే.. అత్యవసర కాంటాక్ట్‌కు సందేశం
ఇందులో క్లిష్టమైన టెక్నాలజీ గానీ, నిరంతర నిఘా వ్యవస్థ గానీ లేదు. యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్‌ను ఓపెన్ చేసి, తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేయడానికి స్క్రీన్‌పై కనిపించే బటన్‌ను ఒక్కసారి నొక్కితే సరిపోతుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో యూజర్ స్పందించకపోతే, యాప్ వెంటనే ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్‌కు సందేశాన్ని పంపుతుంది. దీని ద్వారా సంబంధిత వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు గుర్తించి, తక్షణమే సహాయం అందించే అవకాశం కలుగుతుంది. ప్రారంభంలో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుతం 8 యువాన్లు (దాదాపు రూ.95) చెల్లిస్తే ఉపయోగించుకోవచ్చు.
వివరాలు
యాప్ పేరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య సుమారు 20 కోట్లకు చేరుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వృద్ధాప్యం, ఉపాధి అవకాశాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం, మారుతున్న సామాజిక పరిస్థితులు వంటి కారణాలతో ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. అయితే యాప్‌కు పెట్టిన 'ఆర్ యూ డెడ్?' (మీరు చనిపోయారా?) అనే పేరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది వినియోగదారులు ఈ పేరు ప్రతికూలంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, 'ఆర్ యూ అలైవ్?' లేదా మరేదైనా సానుకూలమైన పేరును సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన యాప్ నిర్వాహకులు, పేరును మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.