AP Govt: సాగునీటి సిబ్బందికి శుభవార్త.. రోజువారీ వేతనం పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థను నిర్వహించే సిబ్బందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీపి వార్త అందించింది. జలవనరుల శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 'లస్కర్ల' ఎన్నో సంవత్సరాల శ్రమను గుర్తిస్తూ వారి రోజువారీ వేతనాలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు చాలా తక్కువగా ఉన్న వేతనాల స్థానంలో గౌరవప్రదమైన జీతభత్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Details
జీతాల పెంపు వివరాలు
కొత్తగా విడుదలైన జీవో ప్రకారం ఇప్పటివరకు లస్కర్లకు చెల్లిస్తున్న రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కి పెంచారు. అంటే రోజుకు అదనంగా రూ.200లబ్ధి కలగనుంది. నెలవారీగా లెక్కిస్తే ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.6,000 వరకు అదనపు ఆదాయం లభించనుంది. నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న నేపథ్యంలో సాగునీటి పంపిణీ వ్యవస్థను కాపాడే బాధ్యతలో లస్కర్ల పాత్ర ఎంతో కీలకం. కాలువలు, తూముల ద్వారా పొలాలకు సక్రమంగా నీటిని విడుదల చేయడం, షట్టర్లను తెరవడం-మూసివేయడం, గేట్ల నిర్వహణను పర్యవేక్షించడం, కాలువల గట్టుల స్థితిని పరిశీలించడం, ప్రమాదకర లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయడం వంటి పనులను వారు నిర్వర్తిస్తుంటారు.
Details
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
అంతేకాకుండా చివరి ఆయకట్టు రైతు వరకు నీరు చేరేలా నిరంతరం పహారా కాస్తూ వ్యవస్థ సక్రమంగా పనిచేయేలా చూసుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు డిమాండ్‌ను పరిష్కరించడం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల్లో ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ఈ చర్య వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు సాగునీటి పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.