Rare Sky Spectacle: ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రాత్రి రెండు చీకట్లు, ఉల్కాపాతం
ఈ వార్తాకథనం ఏంటి
స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తర స్పెయిన్‌లోని బుర్గోస్ ప్రావిన్స్‌లో ఉన్న అవెల్లనోసా డి మునో గ్రామంలో శాశ్వతంగా నివసించేవారు కేవలం 10 మంది వరకు మాత్రమే. అయితే ఆగస్టు 12న మాత్రం ఈ చిన్న గ్రామం వేలాది మంది సందర్శకులతో సందడిగా మారనుంది. ఒకే రాత్రి రెండు అరుదైన ఖగోళ అద్భుతాలను వీక్షించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రామం గ్రహణ సంపూర్ణత మార్గం (Path of Totality) కింద నేరుగా ఉండటంతో అక్కడి నుంచి గ్రహణాన్ని అత్యంత స్పష్టంగా వీక్షించవచ్చు. ఇదే రాత్రి తర్వాత పెర్సీడ్ ఉల్కాపాతం కూడా ఆకాశాన్ని వెలిగించనుంది. ఈవిషయాన్ని బీబీసీ నివేదించింది.
వివరాలు
1912 తర్వాత తొలిసారి సంపూర్ణ సూర్యగ్రహణం..
ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్పెయిన్ ప్రధాన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడం 1912 తర్వాత ఇదే తొలిసారి.
అలాగే యూరప్ ప్రధాన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం 1999 తర్వాత మళ్లీ ఇప్పుడు రానుంది.
దీంతో గత కొన్ని దశాబ్దాల్లో యూరప్‌లో చోటుచేసుకోనున్న అతిపెద్ద ఖగోళ ఘటనల్లో ఇది ఒకటిగా నిలవనుంది.
అయితే ఈ ఘటనను మరింత ప్రత్యేకంగా చేసేది గ్రహణం సంభవించే సమయం.
సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.
వివరాలు
నిమిషాల వ్యవధిలో రెండుసార్లు చీకటి..
చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పివేసే సమయంలో పగటి వెలుతురు ఒక్కసారిగా కనుమరుగవుతుంది.
కొద్దిసేపటి తర్వాత చంద్రుడు సూర్యుడిని వీడటంతో మళ్లీ వెలుతురు కనిపిస్తుంది.
ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సూర్యుడు సహజంగా అస్తమించడంతో మరోసారి చీకటి అలుముకుంటుంది.
అంటే ఒకే సాయంత్రంలో రెండు వేర్వేరు కారణాలతో చీకటిని చూడొచ్చన్నమాట.
ఈ అరుదైన అనుభవాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు, పర్యాటకులు, ఆకాశ పరిశీలకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
అదే రాత్రి పెర్సీడ్ ఉల్కాపాతం..
సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఆ రాత్రే మరో అద్భుతం ఆకాశంలో దర్శనమివ్వనుంది.
ప్రతి ఏడాది కనిపించే పెర్సీడ్ ఉల్కాపాతం ఆగస్టు 12 రాత్రి గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.
దీంతో ఆకాశ వీక్షకులకు ఒకే రాత్రిలో రెండు అద్భుతమైన ఖగోళ దృశ్యాలను చూసే అవకాశం లభించనుంది.
ముందుగా సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ తర్వాత పెర్సీడ్ ఉల్కాపాతం.. ఇలా అరుదైన రెండు ఆకాశ ఘటనలు ఒకే రాత్రి జరగడం ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ఆకర్షణగా మార్చింది.