Chandrayaan-4: 2028లో చంద్రుని నమూనాలు తీసుకురానున్న చంద్రయాన్-4 మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని ఏడు ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే ప్రయోగాల్లో వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహంతో పాటు పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లతో కొన్నిమిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా,ఈ ప్రయోగాల్లో ఒకటి పూర్తిగా భారత పరిశ్రమ నిర్మించిన తొలి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ కావడం ప్రత్యేకం. ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపిన చంద్రయాన్ 4 మిషన్ భారత్ చేపట్టబోయే అత్యంత క్లిష్టమైన చంద్ర యాత్రగా నిలవనుందని నారాయణన్ చెప్పారు. ఇది చంద్రుని నుంచి మట్టి, రాళ్ల నమూనాలు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న మిషన్. "చంద్రయాన్-4ను 2028కి లక్ష్యంగా పెట్టుకున్నాం," అని ఆయన తెలిపారు.
వివరాలు
వేగంగా భారత స్వంత స్పేస్ స్టేషన్ పనులు
ఇప్పటి వరకు చంద్రుని నమూనాలను భూమికి తీసుకురాగలిగిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే. ఇంత భారీ సంఖ్యలో మిషన్లు చేయాల్సిరావడంతో, వచ్చే మూడు సంవత్సరాల్లో ఉపగ్రహాల తయారీని మూడు రెట్లు పెంచాలని ఇస్రో నిర్ణయించింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఇది కీలక అడుగుగా చూస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ రీతిలో పోటీ పడాలన్న లక్ష్యంతో ఇస్రో వేగం పెంచుతోంది. ఇక భారత స్వంత స్పేస్ స్టేషన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028లో ఈ స్పేస్ స్టేషన్‌కు అవసరమైన ఐదు మాడ్యూల్స్‌లో మొదటిదాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు నారాయణన్ తెలియజేశారు.
వివరాలు
'గగనయాన్'పై కూడా స్పష్టతనిచ్చిన నారాయణన్
అమెరికా, చైనా తర్వాత స్వంత స్పేస్ స్టేషన్ నిర్వహించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరేందుకు ఇది మార్గం సుగమం చేస్తున్న ప్రాజెక్ట్. భారత్ తొలి మానవ అంతరిక్ష ప్రయోగం 'గగనయాన్'పై కూడా స్పష్టతనిచ్చిన నారాయణన్, "ఇప్పటివరకు మారింది అన్‌క్రూడ్ మిషన్ షెడ్యూల్ మాత్రమే.అన్‌క్రూడ్ మిషన్ 2025కు మార్చాం. కానీ వ్యోమగాములతో వెళ్లే మిషన్ ఎప్పటిలానే 2027కే ప్లాన్‌డ్, దాంట్లో మార్పు లేదు," అని అన్నారు.
వివరాలు
చైనా 2030లోనే మానవ చంద్రయానం
భారత వ్యోమగాములు వెళ్లే మొదటి ప్రయాణానికి ముందు మూడు అన్‌క్రూడ్ టెస్ట్ మిషన్లు నిర్వహించనున్నారు. ఇక దీర్ఘకాలిక లక్ష్యంగా, 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపై దించి, భద్రంగా భూమికి తీసుకురావాలన్న టార్గెట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రోకు ఇచ్చారు. అమెరికా ఆర్టెమిస్ కింద, చైనా 2030లోనే మానవ చంద్రయానం లక్ష్యంగా పెట్టుకున్న ఈ సమయంలో, భారత్ కూడా చంద్రుడిపై అడుగు పెట్టే దిశగా తన ప్లాన్‌ను స్పష్టంగా రూపొందించింది.