Google: ఖర్చుల నియంత్రణకు గూగుల్ కీలక నిర్ణయం.. పలు దేశాల్లో ఎగ్జిట్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం గూగుల్.. ఒకవైపు కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పలు దేశాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి వైదొలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. సెవరెన్స్ ప్యాకేజీ తీసుకొని సంస్థను వీడాలనుకునే వారికి ఈ ఆఫర్ అందిస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో గూగుల్ ఈ కార్యక్రమాన్ని కెనడా,ఫ్రాన్స్,జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలకు విస్తరించింది. 2025 ప్రారంభంలోనే కొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ఇలాంటి అవకాశం కల్పించామని, జూన్ నుంచి మరిన్ని దేశాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించామని గూగుల్ ప్రతినిధి రాయిటర్స్‌కు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు ఈ ఆఫర్‌ను స్వీకరించారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
వివరాలు
అన్ని విభాగాలకూ వర్తించని ఆఫర్
గూగుల్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ స్వచ్ఛంద ఎగ్జిట్ ఆఫర్ వర్తించదు.
కంపెనీ భవిష్యత్తుకు కీలకమైన ఏఐ పరిశోధన విభాగం డీప్‌మైండ్, గూగుల్ క్లౌడ్ బృందాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు.
ఈ రెండు విభాగాల్లో ఉద్యోగుల అవసరం ఉందని గూగుల్ భావిస్తోంది.
కొన్ని విభాగాల్లో సిబ్బందిని పునర్వ్యవస్థీకరిస్తూనే, ఏఐ, క్లౌడ్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను కొనసాగించాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే ఖర్చుల నియంత్రణతో పాటు భవిష్యత్తులో వృద్ధికి అవకాశాలున్న రంగాలపై దృష్టి సారిస్తోంది.
వివరాలు
స్విట్జర్లాండ్‌లో ఎగ్జిట్ ఆఫర్ ప్రభావం
ఈ కార్యక్రమం ప్రభావం స్విట్జర్లాండ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ జూన్‌లో ఉద్యోగులకు ఈ ఆఫర్ అందించగా, దాన్ని అంగీకరించిన వారు ఆగస్టు నుంచి కంపెనీని వీడటం ప్రారంభించారు.
జ్యూరిచ్‌లో గూగుల్‌కు భారీ ఇంజినీరింగ్ కేంద్రం ఉన్న స్విట్జర్లాండ్‌లో దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ దేశంలో అందించిన ఎగ్జిట్ ప్యాకేజీ ప్రకారం.. ఉద్యోగి సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతం చొప్పున చెల్లిస్తారు.
గరిష్ఠంగా 12 నెలల జీతం వరకు ఈ ప్రయోజనం ఉంటుంది.
దాదాపు 50 మంది సభ్యులున్న ఒక బృందం నుంచి కనీసం నలుగురు ఉద్యోగులు ఈ ఆఫర్‌ను అంగీకరించినట్లు సమాచారం.