Rahul Gandhi: మద్యపానం అలవాటున్న సీఎం డ్రగ్స్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు: రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తి రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. బుధవారం సంగ్రూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన 'ఇన్సాఫ్ ర్యాలీ'లో పాల్గొన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో తాను,భగవంత్ మాన్ లోక్‌సభ సభ్యులుగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను రాహుల్ గుర్తుచేసుకున్నారు. ఉదయం 11 గంటలకే భగవంత్ మాన్ నోటి నుంచి మద్యం వాసన వచ్చేదని ఆరోపించారు. మద్యం సేవించడం ఆయన వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. రోజూ మత్తులో ఉండే ముఖ్యమంత్రి మాదకద్రవ్యాల సమస్యతో బాధపడుతున్న ప్రజల కష్టాలను ఎలా అర్థం చేసుకోగలరని నిలదీశారు.
వివరాలు
పంజాబ్ పాలన కేజ్రీవాల్, అమిత్ షా చేతుల్లో ఉందని ఆరోపణ
పంజాబ్‌కు డ్రగ్స్ సమస్యపై నిజంగా బాధపడే నాయకుడు అవసరమని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌ను పాలించడం లేదని, ఢిల్లీ నుంచి రాష్ట్ర పాలన సాగిస్తోందని రాహుల్ ఆరోపించారు.
పంజాబ్ పాలనలో సగం అరవింద్ కేజ్రీవాల్, మిగిలిన సగం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.
భగవంత్ మాన్ మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం మినహా ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంజాబ్ నుంచే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.
మూడేళ్లలో పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుబట్టారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకాలం అధికారంలో కొనసాగకపోవచ్చని వ్యాఖ్యానించారు.
వివరాలు
ప్రధాని మోదీతో చర్చకు తాను సిద్ధమంటూ మరోసారి సవాల్
గతంలో పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య తీవ్రత పెరుగుతోందని తాను హెచ్చరించినప్పుడు బీజేపీ, అకాలీదళ్ పట్టించుకోలేదని రాహుల్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని అరికట్టాలంటే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
వ్యవసాయ రంగాన్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కేవలం ఐదు నిమిషాల్లోనే మోదీ ఒక 'దేశద్రోహి' అని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని నిరూపించగలనని వ్యాఖ్యానించారు.