ఎటెళ్ళినా తీసుకెళ్ళగలిగే కాలుష్య తీవ్రతను కొలిచే డివైజ్ ని తయారుచేసిన ఐఐటీ మద్రాస్
కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే ఉద్గారాల వలన గాలికాలుష్యం పెరుగుతూనే ఉంది. అయితే గాలి కాలుష్యాన్ని గుర్తించే కొన్ని డివైజులు ఉంటాయి. వీటిని ఎక్కడైతే అమర్చుతామో ఆయా ప్రాంతాల కాలుష్యాన్ని మాత్రమే చూపిస్తాయి. వీటిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లడం కుదరదు. తాజాగా ఐఐటీ మద్రాసు శాస్త్రవేత్తలు సరికొత్త డివైజును కనుగొన్నారు. గాలి కాలుష్యాన్ని గుర్తించే మొబైల్ డివైజును తయారు చేసారు. దీని ప్రకారం మీరు ఏ ప్రాంతానికైనా ఈ డివైజును తీసుకెళ్ళవచ్చన్న మాట. అంటే ఒకచోటు నుండి మరో చోటుకు తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో కాలుష్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
కాట్రు ప్రాజెక్ట్ లో భాగంగా రెండు పరికరాలు
విచిత్రం ఏంటంటే, ఈ డివైజును బైక్ సైడ్ మిర్రర్ లా అమర్చుకోవచ్చు. మీరు వెళ్ళిన ప్రాంతంలో కాలుష్య తీవ్రత ఎలా ఉందో ఈ డివైజ్ చూపిస్తుంది. తద్వారా మీరు అప్రమత్తంగా ఉంటారు. ఈ పరిశోధనకు ప్రాజెక్ట్ కాట్రు(కాట్రు అంటే తమిళంలో గాలి) అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాలుష్యాన్ని కొలిచే రెండు పరికరాలను తయారు చేసారు. అందులో ఒక పరికరాన్ని ఇళ్ళపై అమర్చుకుంటే ఆ ప్రాంతంలో కాలుష్య తీవ్రత ఎలా ఉందో చూపిస్తుంది. మరొకటి వాహనాలకు అమర్చుకునే సౌకర్యం ఉంది. ఈ మొబైల్ డీవైజు ద్వారా కాలుష్య తీవ్రత, ఉష్ణోగ్రత, ఎంతదూరం వరకు కాలుష్య తీవ్రత ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు ప్రొఫెసర్ రంగనాథన్ రంగస్వామి సారథ్యం వహించారు.