ISRO: ఇస్రో మరో మైలురాయి: గగనయాన్ ఇంజిన్ కొత్త స్టార్ట్-అప్ విధానం పరీక్ష విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ ప్రయోగానికి కీలకమైన మరో మైలురాయిని అందుకుంది. నవంబర్ 7, 2025న మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో, ఎల్‌వీఎం3 రాకెట్‌ను నడిపించే సిఇ20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త "బూట్‌స్ట్రాప్ మోడ్"లో విజయవంతంగా స్టార్ట్ చేయగలిగారు. ఈ ఇంజిన్ ఇప్పటికే 19 నుంచి 22 టన్నుల వరకూ త్రస్ట్ స్థాయిలో ప్రయోగాల్లో పనిచేసింది. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ స్టార్ట్ సాధించడం ప్రత్యేకత. అదనంగా ఉండే stored-gas సిస్టమ్ అవసరం లేకుండా, thrust chamber, gas generator—ఇరువర్గాల్లో మల్టీ ఎలిమెంట్ ఇగ్నిటర్ ఉపయోగించి ఈ విధానం సాధించారు.
వివరాలు
ఇస్రో స్థాయిని ఈ కొత్త మోడ్ మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు
ఈ కొత్త స్టార్ట్-అప్ టెక్నిక్ వల్ల ఇంజిన్‌లోని టర్బోపంపులు తానే వేగం పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయి. దీంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థ్యం పెరుగుతుంది. పైగా ప్రయాణ మధ్యలో ఇంజిన్‌ను మళ్లీ మళ్లీ ఆన్-ఆఫ్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. బహుళ కక్ష్య ప్రయోగాలు, కాంప్లెక్స్ మిషన్ ప్రొఫైల్‌లు, ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం. గగనయాన్ మిషన్‌కు ఈ నూతన టెక్నాలజీ మరింత వేగం జోడించినట్టైంది. భారతీయ రాకెట్‌పై భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే చారిత్రక లక్ష్యానికి ఇస్రో మరింత దగ్గరైంది. శాస్త్రీయంగానూ, వాణిజ్య రంగంగానూ ఇస్రో స్థాయిని ఈ కొత్త మోడ్ మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.