ISRO: మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. జనవరి 12న EOS-N1 శాటిలైట్ ప్రయోగం ..
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరం ప్రారంభాన్ని మరో కీలక అంతరిక్ష ప్రయోగంతో జరుపుకోనుంది. భూమి పరిశీలనకు ఉపయోగపడే అత్యాధునిక ఉపగ్రహాన్ని తన విశ్వసనీయ రాకెట్ పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి పంపనుంది. 'పీఎస్‌ఎల్‌వీ సీ62 / ఈఓఎస్-ఎన్1' మిషన్ జనవరి 12 ఉదయం 10.17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభం కానుంది. ఈ మిషన్‌లో ప్రయోగించబోయే ఈఓఎస్-ఎన్1 హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం విశేషం. ఇది భూభాగంపై ఉన్న వస్తువుల ఆకారాలు, రంగులు మాత్రమే కాక,వందలాది సూక్ష్మ తరంగదైర్ఘ్యాల ద్వారా వాటి స్వభావాన్ని కూడా గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంది.
వివరాలు
ప్రధాన ఉపగ్రహం తో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాలు
ఖనిజాలు,పంటలు,నీటి వనరులు, భూభాగ వినియోగం వంటి భూఅంశాలను మరింత ఖచ్చితంగా విశ్లేషించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ప్రధాన ఉపగ్రహం తో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాలను కూడా పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. వీటిలో కొన్ని భారతదేశానికి చెందినవే, మరికొన్ని అంతర్జాతీయ వినియోగదారులవే. ఈ ప్రయోగ సేవలను ఇస్రో పారిశ్రామిక భాగస్వామి న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) మార్కెట్ చేస్తోంది. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఐఎల్ పీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 137కి పైగా కస్టమర్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
వివరాలు
ఈ ఏడాది ఇస్రోకు బిజీ షెడ్యూల్
ఈ ఏడాది ఇస్రోకు బిజీ షెడ్యూల్ ఉంది. ఇందులో భాగంగా గగన్యాన్ మిషన్ కు సంబంధించిన తొలి మానవ రహిత ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగంలో మానవులకు అనువైన రాకెట్ గాలి గుణకాలు, కక్ష్యా మాడ్యూల్ ఆపరేషన్లు, భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశం, క్రూ మాడ్యూల్ రికవరీ వంటి అంశాలను పూర్తిస్థాయిలో పరీక్షిస్తారు. అంతే కాక, కొత్త సాంకేతికతలు, స్వదేశీ భాగాల పనితీరును పరీక్షించడానికి టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ సాటిలైట్ (టిడిఎస్-01) ను కూడా ప్రయోగించనున్నారు. అదే సమయంలో,భారత పరిశ్రమలు పూర్తిగా తయారు చేసిన తొలి పీఎస్‌ఎల్‌వీ పై ఆసక్తి నెలకొంది. ఈ రాకెట్‌ను ఎన్‌ఎస్‌ఐఎల్ ఆధ్వర్యంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్),ఎల్ అండ్ టీ కన్సార్టియం నిర్మిస్తోంది.
వివరాలు
ఈ డేటా మత్స్యకారులకు..
ఈ రాకెట్ ద్వారా ఓషన్‌సాట్-3ఏ (ఈఓఎస్-10) ఉపగ్రహం,ఇండో-మారిషస్ సంయుక్త ఉపగ్రహం, లీప్-2 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఓషన్‌సాట్-3ఏ సముద్ర, వాతావరణ, భూభాగ అధ్యయనాల కోసం కీలక ఉపగ్రహంగా భావిస్తున్నారు. దీనిలో సముద్ర రంగు పరిశీలన పరికరం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కొలిచే పరికరం, వాతావరణ ఉష్ణోగ్రత-తేమ కొలిచే సెన్సర్లు ఉన్నాయి. ఈ డేటా మత్స్యకారులకు చేపల వేట ప్రాంతాల గుర్తింపు, తీర ప్రాంతాల నిర్వహణ, వాతావరణ అంచనాలు, ఉష్ణమండల వాయుగుండాల పరిశీలన వంటి అనేక రంగాలలో ఉపయోగపడనుంది.