Lunar eclipse 2026: ఆకాశంలో అరుదైన అద్భుతం..'బ్లడ్ మూన్'లా కనిపించనున్న చంద్రుడు.. భారత్‌లో మాత్రం ఎందుకు కనిపించదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 27-28 మధ్యరాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. పాక్షిక చంద్రగ్రహణం రూపంలో కనిపించనున్న ఈ అద్భుతం ఖగోళ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. గ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని దాదాపు పూర్తిగా కమ్మేయనుంది. దీంతో కొన్ని గంటల పాటు చంద్రుడు ముదురు ఎరుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఈ కారణంగానే దీనిని 'బ్లడ్ మూన్'గా అభివర్ణిస్తున్నారు. 96 శాతం చంద్రుడిపై భూమి నీడ ఈ పాక్షిక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి ఉపరితలంలో దాదాపు 96 శాతం భాగం భూమి ప్రధాన నీడలోకి వెళ్లనుంది. కేవలం 4 శాతం ప్రాంతం మాత్రమే సూర్యకాంతిని అందుకుంటుంది. ఫలితంగా చంద్రుడు పూర్తిగా చీకటిగా కనిపించకుండా.. రాగి లేదా ముదురు ఎరుపు రంగులో దర్శనమిస్తాడు.
వివరాలు
చంద్రుడు ఎరుపు రంగులోకి ఎందుకు మారతాడు?
కొన్ని గంటల పాటు కొనసాగే ఈ అరుదైన దృశ్యం ఆకాశ వీక్షకులను ఆకట్టుకోనుంది.
సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి ప్రధాన నీడ(ఉంబ్రా)లోకి ప్రవేశిస్తాడు.
దీంతో సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడి ఉపరితలంపై పడదు.
సూర్యకాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలి కాంతి భూమి వాతావరణంలో ఎక్కువగా చెల్లాచెదురవుతుంది.
అదే సమయంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు,నారింజ రంగు కాంతి భూమి వాతావరణాన్ని దాటి ముందుకు సాగుతుంది.
భూమి వాతావరణం ఈ కాంతిని వడకట్టి చంద్రుడి వైపు మళ్లిస్తుంది.
అలా వంగి ప్రయాణించిన ఎరుపు,నారింజ కిరణాలు చంద్రుడి ఉపరితలాన్ని తాకుతాయి.
అందువల్ల భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. ఇదే'బ్లడ్ మూన్'వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.
వివరాలు
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి ఉండటంతో సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది.
ఫలితంగా భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడు పూర్తిగా లేదా కొంత మేరకు మసకబారినట్లు కనిపిస్తాడు.
చంద్రగ్రహణం కేవలం పౌర్ణమి రోజునే సంభవిస్తుంది. అయితే ప్రతి పౌర్ణమికీ గ్రహణం ఏర్పడదు.
భూమి నీడ చంద్రుడిపై పడే విధానాన్ని బట్టి చంద్రగ్రహణాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.
వివరాలు
1. పాక్షిక చంద్రగ్రహణం
ఈసారి ఏర్పడేది పాక్షిక చంద్రగ్రహణమే. ఇందులో చంద్రుడి కొంత భాగం మాత్రమే భూమి ప్రధాన నీడలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల చంద్రుడి ఒక భాగం చీకటిగా, మరో భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
2. సంపూర్ణ చంద్రగ్రహణం
చంద్రుడు పూర్తిగా భూమి ప్రధాన నీడలోకి వెళ్లినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలోనూ సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటారు.
సంపూర్ణ గ్రహణంలోనూ చంద్రుడు పూర్తిగా నల్లగా మారడు. భూమి వాతావరణం గుండా ప్రయాణించే సూర్యకాంతి వక్రీభవనం చెంది చంద్రుడిపైకి చేరుతుంది.
అందులోని ఎరుపు, నారింజ రంగు కాంతి ఎక్కువగా చంద్రుడిని తాకుతుంది. అందుకే చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. దీనినే 'బ్లడ్ మూన్'గా పిలుస్తారు.
వివరాలు
ఈసారి 'దాదాపు బ్లడ్ మూన్' ప్రత్యేకత
సాధారణంగా సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలోనే బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఈసారి ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
చంద్రుడి ఉపరితలంలో దాదాపు 96.2 శాతం భాగం భూమి ప్రధాన నీడ (ఉంబ్రా)లోకి వెళ్లనుంది.
దీంతో చంద్రుడిలో అత్యధిక భాగం ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. కేవలం చిన్న అంచు మాత్రమే ప్రకాశవంతంగా మిగులుతుంది.
అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని 'దాదాపు బ్లడ్ మూన్' (Almost Blood Moon)గా అభివర్ణిస్తున్నారు.
వివరాలు
ఎక్కడ కనిపిస్తుంది?
ఆగస్టు 27-28 తేదీల మధ్య ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా,దక్షిణ అమెరికా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి స్పష్టంగా కనిపించనుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 330కోట్ల మంది ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. గ్రహణంలోని ప్రతి దశ భూమిపై ఒకే సమయంలోనే జరుగుతుంది.
అయితే ప్రజలు ఉన్న ప్రాంతం, టైమ్‌జోన్‌ను బట్టి స్థానిక సమయాల్లో తేడా ఉంటుంది.
అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాలైన లాస్ ఏంజిల్స్(కాలిఫోర్నియా),పోర్ట్‌ల్యాండ్(ఒరెగాన్)నుంచి చూసేవారికి సూర్యాస్తమయం తర్వాత కొన్ని గంటలకు గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
న్యూయార్క్, జాక్సన్‌విల్లే వంటి తూర్పు తీర నగరాల్లో అర్ధరాత్రి సమయంలో చంద్రగ్రహణం అత్యంత స్పష్టంగా దర్శనమిస్తుంది.
అయితే భారత్‌లో మాత్రం ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం సాధ్యం కాదు.
వివరాలు
భారత్‌లో ఎందుకు కనిపించదు?
యూకే, ఐరోపా, ఆఫ్రికా ప్రాంతాల్లో గ్రహణం తెల్లవారుజామున సంభవిస్తుంది.
సూర్యోదయానికి కొద్దిసేపటి ముందు చంద్రుడు పశ్చిమ దిశలో అస్తమించడానికి దగ్గరగా ఉన్న సమయంలో గ్రహణం కొనసాగుతుంది.
గ్రహణం సంభవించే సమయంలో భూమిపై ఏ ప్రాంతాల్లో పగటి సమయం ఉంటుందో, అక్కడి ప్రజలకు చంద్రుడు ఆకాశంలో కనిపించడు.
ఆ సమయంలో భారత్‌లో పగటి సమయం కావడంతో మన దేశం నుంచి ఈ గ్రహణాన్ని నేరుగా చూడలేం.
భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి పలు దేశాల ప్రజలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
అయితే ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంటి నుంచే ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
వివరాలు
లైవ్ స్ట్రీమింగ్‌లో ఎలా చూడాలి?
నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యేక కెమెరాల ద్వారా చంద్రగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆగస్టు 28 ఉదయం నుంచి నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదా 'NASA+' యాప్‌లో ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్
ఖగోళ సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేసే 'Timeanddate.com' గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు వివిధ దశలను హై-డెఫినిషన్ (HD) లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించనుంది.
వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్
అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం నిర్వహించే 'The Virtual Telescope Project' రోబోటిక్ టెలిస్కోప్‌ల సహాయంతో ఈ గ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
వివరాలు
సోషల్ మీడియా,వెబ్ పోర్టల్స్‌లోనూ..
గ్రహణం గరిష్ఠ దశకు చేరుకునే సమయంలో అమెరికా,ఐరోపా దేశాల్లోని ప్రజలు తీసే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించనున్నాయి.
భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28 ఉదయం 09:43 గంటలకు గ్రహణం ఉచ్ఛదశకు చేరుకోనుంది.
ఆ సమయంలో ఎక్స్ (గతంలో ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో #LunarEclipse, #BloodMoon హ్యాష్‌ట్యాగ్‌లతో ఫొటోలు, వీడియోలు అందుబాటులోకి రానున్నాయి.
భారత ప్రామాణిక సమయం ప్రకారం గ్రహణ వేళలు
ఆగస్టు 28న గ్రహణం జరిగే సమయాలు ఇలా ఉన్నాయి:
గ్రహణం ప్రారంభం: ఉదయం 06:53గంటలకు
పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం: ఉదయం 08:03గంటలకు
గ్రహణం గరిష్ఠ స్థాయి(ఉచ్ఛదశ): ఉదయం 09:43గంటలకు
పాక్షిక చంద్రగ్రహణం ముగింపు: ఉదయం 11:21గంటలకు
గ్రహణ ప్రక్రియ పూర్తిగా ముగిసే సమయం: మధ్యాహ్నం 12:31గంటలకు