Loading...
Barreleye Fish: ద్యావుడా...ఇదేం చేపరా బాబు ఇలా ఉంది...కళ్లు చూస్తే
ద్యావుడా...ఇదేం చేపరా బాబు ఇలా ఉంది...కళ్లు చూస్తే

Barreleye Fish: ద్యావుడా...ఇదేం చేపరా బాబు ఇలా ఉంది...కళ్లు చూస్తే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

చేప అంటే మనకు సాధారణంగా కళ్లు, నోరు, పొలుసులతో ఉండే రూపమే గుర్తుకొస్తుంది. కానీ సముద్రం అడుగున ఉండే కొన్ని జీవులను చూస్తే ప్రకృతి సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుందో అర్థమవుతుంది. అలాంటి ఓ అరుదైన చేప ఇప్పుడు శాస్త్రవేత్తల కెమెరాకు చిక్కింది. దాని పేరు బారెల్‌ఐ (Barreleye). దీని ప్రత్యేకత ఏమిటంటే తల మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ఆ తల లోపల ఆకుపచ్చ రంగులో కనిపించే కళ్లు బయట నుంచే స్పష్టంగా కనిపిస్తాయి. అమెరికాలోని మాంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (MBARI) పరిశోధకులు పసిఫిక్ మహాసముద్రంలో ఈ వింత చేపను చిత్రీకరించారు.

Details

సముద్రంలో 1,970 అడుగుల లోతులో..

మాంటెరీ కాన్యన్‌కు సుమారు 55 మైళ్ల దూరంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ చేప కనిపించింది.

సముద్ర మట్టానికి దాదాపు 1,970 అడుగుల లోతులో దీన్ని గుర్తించారు.

పరిశోధకులు తమ రిమోట్ ఆపరేటెడ్ వాహనం డాక్ రికెట్స్ సాయంతో సుమారు 20 నిమిషాల పాటు దీన్ని పరిశీలించి, హైడెఫినిషన్ వీడియోను రికార్డు చేశారు.

డేవిడ్ ప్యాకర్డ్ అనే పరిశోధనా నౌక నుంచి ఈ అధ్యయనం కొనసాగింది.

సాధారణంగా సముద్రపు లోతుల్లో నివసించే జీవులను ప్రత్యక్షంగా చూడటం చాలా కష్టం. అందుకే ఈ వీడియో పరిశోధకులకు ప్రత్యేకమైన అనుభవంగా మారింది.

Details

తల పారదర్శకంగా ఉండటం వెనుక కారణం!

ఈ చేప శాస్త్రీయ నామం మాక్రోపిన్నా మైక్రోస్టోమా (Macropinna microstoma). దీని పొడవు సుమారు 6 అంగుళాలు మాత్రమే. సముద్ర ఉపరితలం నుంచి 2,000 నుంచి 2,600 అడుగుల లోతులోని ట్విలైట్, మిడ్‌నైట్ జోన్లలో నివసిస్తుంది.

దీని తలపై ఉండే పారదర్శక కవచం లోపల కళ్ల నిర్మాణం కనిపించడం ప్రత్యేకత. ఆకుపచ్చగా కనిపించే ఆ కళ్లు ఈ చేపకు విచిత్రమైన రూపాన్ని ఇస్తాయి.

గతంలో వలల ద్వారా సేకరించిన నమూనాల ఆధారంగా వేసిన చిత్రాల్లో ఈ పారదర్శక కవచం కనిపించకపోవడంతో శాస్త్రవేత్తలు దీని అసలు రూపాన్ని గుర్తించడం కష్టమయ్యేది.

ADVERTISEMENT

Details

40 ఏళ్ల పరిశోధనలో పదిసార్లే కనిపించింది!

MBARI పరిశోధకులు సముద్ర లోతుల్లో దాదాపు 40 ఏళ్లుగా అన్వేషణ సాగిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ జాతి చేపను కేవలం 10 సార్లు మాత్రమే గుర్తించగలిగారు.

ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త స్టీవెన్ హాడాక్ మాట్లాడుతూ.. ఊహాశక్తి ఉన్న చిన్నపిల్లాడు సృష్టించిన జీవిలా ఈ చేప కనిపిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సహజ వాతావరణంలో, పారదర్శక తల కవచం చెక్కుచెదరకుండా ఉన్న చేపను చూడటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

మొత్తానికి సముద్ర గర్భంలో ఇంకా మనకు తెలియని ఎన్నో అద్భుత జీవులు ఉన్నాయని ఈ అరుదైన వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.

ADVERTISEMENT