ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రయోగంలో సాంకేతిక అంతరాయం..ఇస్రో తొలి 2026 ప్రయోగంలో అడ్డంకి
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక అంతరాయం చోటుచేసుకుంది. దేశ రక్షణ రంగానికి కీలకమైన 'ఈఓఎస్-ఎన్1' (అన్వేష) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లిన ఈ రాకెట్‌లో సమస్య ఏర్పడినట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. ప్రయోగం మూడో దశ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిందని,ఆ తర్వాత దశలోనే అంతరాయం ఎదురైందని వెల్లడించారు. ఈ సమస్యకు కారణాలు ఏమిటన్న దానిపై ప్రస్తుతం సాంకేతిక నిపుణులు లోతుగా పరిశీలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.
వివరాలు
'ఈఓఎస్-ఎన్1' ఉపగ్రహానికి ప్రాధాన్యం
ఈ రాకెట్ ద్వారా 'ఈఓఎస్-ఎన్1' ఉపగ్రహంతో పాటు భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ వంటి దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా పంపించారు. అయితే, ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే దశలోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం గమనార్హం. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య మిషన్. ఈ మిషన్‌లో ప్రధానంగా 'ఈఓఎస్-ఎన్1' ఉపగ్రహానికి ప్రాధాన్యం ఉంది. రక్షణ,పరిశోధన,అభివృద్ధి సంస్థ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం సరిహద్దుల పర్యవేక్షణ,వ్యవసాయ రంగ అవసరాలు,విపత్తుల నిర్వహణ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించనుంది.