Loading...
Sarvam Prism: AI రంగంలో సర్వమ్‌ సంచలనం.. 44 మిల్లీసెకన్లలోనే నిర్ణయాలు
AI రంగంలో సర్వమ్‌ సంచలనం.. 44 మిల్లీసెకన్లలోనే నిర్ణయాలు

Sarvam Prism: AI రంగంలో సర్వమ్‌ సంచలనం.. 44 మిల్లీసెకన్లలోనే నిర్ణయాలు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 04, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక కస్టమర్‌ ఫోన్‌ చేసినప్పుడు అతని సమస్యను గుర్తించి సరైన విభాగానికి పంపడం, వందల పేజీల పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని వేరు చేయడం.. ఇలాంటి పనులను మనుషుల జోక్యం లేకుండానే వేగంగా చేయగలిగితే? ఈ దిశగా భారతీయ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సర్వమ్‌ మరో ముందడుగు వేసింది. 'ప్రిజమ్‌' పేరుతో సరికొత్త నిర్ణయాత్మక AI మోడల్‌ను విడుదల చేసింది. ఇది కేవలం 44 మిల్లీసెకన్లలోనే స్పందించగలదని సంస్థ వెల్లడించింది. వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్‌ను మార్చుకుని, సొంత కంప్యూటింగ్‌ వ్యవస్థల్లోనే అమలు చేసుకోవచ్చు.

Details

మూడు పరీక్షల్లో 71.8 సగటు స్కోర్

సర్వమ్‌ రూపొందించిన 105 బిలియన్‌ పారామీటర్ల బేస్‌ మోడల్‌ ఆధారంగా ప్రిజమ్‌ను అభివృద్ధి చేశారు. వేగంగా, క్రమబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పనుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

మూడు బెంచ్‌మార్క్‌ పరీక్షల్లో ఈ మోడల్‌ సగటున 71.8 స్కోర్‌ సాధించింది. NVIDIA B200 GPUపై పరీక్షించినప్పుడు కేవలం 44 మిల్లీసెకన్లలో స్పందించినట్లు కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది.

100 మిల్లీసెకన్లలోపు స్పందించిన 25 నిర్ణయాత్మక AI మోడళ్లను పరిశీలించగా, వాటన్నింటిలో ప్రిజమ్‌ అత్యధిక స్కోర్‌ సాధించిందని తెలిపింది.

Details

తప్పులను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం

AI ఇచ్చే సమాధానం ఎంతవరకు నమ్మదగినదో తెలుసుకోవడం సంస్థలకు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆటోమేటిక్‌గా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిజమ్‌లో సమాధానాలపై విశ్వసనీయత అంచనాలను అందించే సదుపాయం రూపొందించారు.

కనీసం 90 శాతం నమ్మకంతో సమాధానాలు ఇచ్చిన సందర్భాల్లో, ఇంగ్లిష్‌ సమాధానాల్లో 2.2 శాతం, భారతీయ భాషల సమాధానాల్లో 4.4 శాతం మాత్రమే తప్పులు నమోదయ్యాయని పరీక్షల్లో వెల్లడైంది. అంతేకాదు, ఎంపికల క్రమాన్ని మార్చినా స్థిరమైన సమాధానాలు ఇచ్చింది.

ADVERTISEMENT

Details

సంస్థల సొంత డేటాతో శిక్షణ ఇచ్చుకోవచ్చు

ప్రిజమ్‌ మోడల్‌ వెయిట్స్‌ను Apache 2.0 లైసెన్స్‌తో విడుదల చేయడం మరో ముఖ్యమైన అంశం. దీనివల్ల సంస్థలు తమ డేటాతో మోడల్‌కు శిక్షణ ఇచ్చి, తమ సొంత సర్వర్లపైనే నడుపుకోవచ్చు.

కస్టమర్‌ సపోర్ట్‌ విభాగాలకు ఫిర్యాదులను పంపడం, పత్రాల విశ్లేషణ, భద్రతా తనిఖీలు, ఇతర AI ఏజెంట్ల పనితీరును అంచనా వేయడం వంటి పనుల్లో దీన్ని ఉపయోగించవచ్చు.

వ్యాపార సంస్థలు AIని రోజువారీ కార్యకలాపాల్లో మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం.

వేగంతో పాటు నమ్మకమైన నిర్ణయాలు అందించడంలో ప్రిజమ్‌ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది వాస్తవ వినియోగంలో తేలనుంది.

ADVERTISEMENT