iPhone 4: యువతలో మళ్లీ ట్రెండ్ అవుతున్న 16 ఏళ్ల పాత ఐఫోన్.. కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్ ఫోన్‌లతో నిత్యం మమేకమై అలసిపోయిన యువతలో ఇప్పుడు ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఆధునిక టెక్నాలజీకి బ్రేక్ ఇచ్చేందుకు, 16 ఏళ్ల క్రితం విడుదలైన ఐఫోన్ 4ను మళ్లీ వాడడం ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయనే కారణంతో కాదు... అవి లేవనే కారణంతోనే ఈ పాత ఫోన్ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, 2010లో విడుదలైన ఐఫోన్ 4పై అకస్మాత్తుగా ఆసక్తి భారీగా పెరిగింది. అప్పట్లో అత్యాధునిక సాంకేతికతకు ప్రతీకగా నిలిచిన ఈ ఫోన్, నేడు మాత్రం దానికి పూర్తి విరుద్ధమైన లక్షణాల వల్ల ఆదరణ పొందుతోంది. సోషల్ మీడియాలో యువత ఐఫోన్ 4తో తీసిన ఫొటోలను షేర్ చేస్తూ,తాజా స్మార్ట్‌ఫోన్లతో తీసిన చిత్రాలతో పోల్చి చూపిస్తున్నారు.
Details
మార్కెట్లో స్పష్టంగా కన్పిస్తున్న ప్రభావం
కొత్త ఫోన్లు క్రిస్టల్ క్లియర్ ఇమేజెస్ ఇస్తే, ఐఫోన్ 4 మాత్రం కొంచెం గ్రెయినీగా, సహజంగా కనిపించే ఫొటోలను ఇస్తోంది. ఈ ఫొటోల్లో క్లారిటీ ఎక్కువగా కనిపిస్తోందని యూజర్లు భావిస్తున్నారు. కొందరు అయితే దీన్ని 'కొత్త తరహా డిజిటల్ కెమెరా'గా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ ఫోన్ ఇచ్చే వైబ్‌కి సాటిలేదని ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ నాస్టాల్జియా ప్రభావం మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
Details
ఐఫోన్ 4లకు డిమాండ్ ఎక్కువ
గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, ఐఫోన్ 4 కొనుగోలుకు సంబంధించిన సెర్చ్‌లు దాదాపు వెయ్యి శాతం వరకు పెరిగాయి. ఇక ఈబే వంటి రీసేల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ ఫోన్ భారీ ధరలకు అమ్ముడవుతోంది. ముఖ్యంగా ఉపయోగించని లేదా ఒరిజినల్ బాక్స్‌తో ఉన్న ఐఫోన్ 4లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 16 ఏళ్ల పాత డివైస్ అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీ అలసట నుంచి బయటపడాలనుకునే యువతకు ఇది కొత్త ఆశ్రయంగా మారడం గమనార్హం. టెక్నాలజీ భవిష్యత్తు... కొందరికి ఇప్పుడు గతంలోనే కనిపిస్తోందని ఈ ట్రెండ్ స్పష్టంగా చెబుతోంది.