Women Andhra premier league : డబ్ల్యూఏపీఎల్ వేలం ముగిసింది.. 'అమరావతి ఈ ఛాంపియన్స్'లో అనూష, దేవిక
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి. ఆల్‌రౌండర్ హెర్నిటా ప్లవియా ఫెరీరాకు వేలంలో అత్యధిక ధర లభించింది. ఆమెను గోదావరి గోల్డెన్ ఈగల్స్ రూ.4.30 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత అంజలి శర్వాణికి రూ.3.60 లక్షలు దక్కాయి. ఆమెను వైజాగ్ ఫైర్‌బర్డ్స్ జట్టు కొనుగోలు చేసింది. అదే జట్టు ఆయేషా సింగ్‌ను రూ.2.40 లక్షలకు దక్కించుకుంది. 'అమరావతి ఈ ఛాంపియన్స్' జట్టు అనూషను రూ.2.10 లక్షలకు, దేవికను రూ.2 లక్షలకు సొంతం చేసుకుంది.
వివరాలు
రూ.2.10 లక్షలకు వేములపాటి సేతుసాయి..
రాయలసీమ జెన్‌స్టార్స్ వేములపాటి సేతుసాయిని రూ.2.10 లక్షలకు తీసుకుంది.
టీమిండియా తరఫున ఆసియా కప్, ఆసియా క్రీడల జట్టులో ఆడనున్న స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి ఈ లీగ్ తొలి అంకంలో అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో.. ఆమె కోసం ఫ్రాంఛైజీలు పెద్దగా పోటీ పడలేదు.
చివరికి శ్రీ చరణిని రాయలసీమ జెన్‌స్టార్స్ రూ.1.10 లక్షలకు దక్కించుకుంది.
డబ్ల్యూఏపీఎల్‌లో ఆడనున్న అత్యంత పిన్న వయస్కురాలిగా 12 ఏళ్ల సాయి షణ్ముకప్రియ నిలిచింది.
ఆమె కూడా రాయలసీమ జెన్‌స్టార్స్ తరఫున బరిలోకి దిగనుంది. వేలం కోసం మొత్తం 191 మంది క్రీడాకారిణులు పేర్లు నమోదు చేసుకోగా.. ఫ్రాంఛైజీలు 74 మందికి అవకాశం కల్పించాయి.
వివరాలు
'అమరావతి ఈ ఛాంపియన్స్'లో 11 మంది ఆల్‌రౌండర్లు..
మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో సెప్టెంబర్ 15న డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం కానుంది.
లీగ్ అంబాసిడర్ మిథాలీ రాజ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు, ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ తదితరులు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు.
డబ్ల్యూఏపీఎల్ వేలంలో 'అమరావతి ఈ ఛాంపియన్స్' వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
లీగ్‌కు అందుబాటులో ఉండే క్రీడాకారిణులతో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ రాణించగల ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
జట్టులో ఎక్కువ మంది గ్రేడ్-ఏ క్రికెటర్లు ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
వివరాలు
ఏకంగా 11 మంది ఆల్‌రౌండర్లు..
గ్రేడ్-ఏలో ఉన్న నీరగట్టు అనూష (బ్యాటర్), కండ్రేగుల దేవిక (ఆల్‌రౌండర్), కాట్రగడ్డ దీక్ష (వికెట్ కీపర్), షబ్నమ్ షకీల్ (ఆల్‌రౌండర్), పి. రంగలక్ష్మి (బ్యాటర్), తరుణి జోషి (ఆల్‌రౌండర్), అంకం విష్ణుప్రియ (బ్యాటర్)లను అమరావతి ఈ ఛాంపియన్స్ దక్కించుకుంది.
వీరంతా వన్డే, టీ20 ఫార్మాట్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించారు.
మిగిలిన క్రీడాకారిణులను గ్రేడ్-బి నుంచి ఎంపిక చేసుకుంది. ఈ జట్టులో ఏకంగా 11 మంది ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం.