BCCI: సెప్టెంబర్ 18న బీసీసీఐ ఏజీఎం.. ఆ ఇద్దరి అంశం చర్చకు వచ్చేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముంబయిలో సెప్టెంబర్ 18న జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. రెండు ప్రధాన అంశాలతో కూడిన అజెండాపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపైనా సమీక్ష ఉంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఎన్నికల నిర్వహణ ఇలా..
బీసీసీఐ ఇప్పటికే సభ్యులకు నోటిఫికేషన్ పంపించింది. ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని సూచించింది.
ఇందుకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. ఓటర్ల జాబితా ముసాయిదాను సెప్టెంబర్ 1న విడుదల చేయనుంది.
బీసీసీఐ సభ్యులుగా ఎన్నిక కావాలనుకునే వారు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు.
సెప్టెంబర్ 12న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయడంతో పాటు అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 18న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
వివరాలు
ఐపీఎల్‌తోపాటు ఐసీసీలోకి..
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి కొత్త ప్రతినిధులను తీసుకునే అంశంపై వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
ఇందులో భాగంగా ఇద్దరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో భారత్ తరఫున ప్రతినిధిగా ఎవరిని నియమించాలనే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన జైషా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు అండమాన్, నికోబార్ క్రికెట్ సంఘాలకు బీసీసీఐ అసోసియేట్ మెంబర్‌షిప్ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ రెండు సంఘాలు బీసీసీఐకి అనుబంధంగా మారితే అండమాన్, నికోబార్ దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
సభ్యులకు పంపించిన సర్క్యులర్‌లో బీసీసీఐ ఈ ప్రతిపాదనను కూడా పొందుపరిచింది.