LOADING...
Fifa World Cup: 'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు
'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు

Fifa World Cup: 'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా నాకౌట్ అంచు వరకు వెళ్లి చివరికి గట్టెక్కింది. ప్రిక్వార్టర్ పోరులో ఈజిప్ట్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదుర్కొన్న అర్జెంటీనా.. ఒక దశలో 0-2తో వెనుకబడినా అనంతరం అద్భుతంగా పుంజుకుని 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ 59వ నిమిషంలో ఈజిప్ట్ ఆటగాడు మోస్తాఫా జికో చేసిన గోల్‌ను రిఫరీ ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ నిర్ణయంపై మ్యాచ్ అనంతరం ఈజిప్ట్ కోచ్ హోస్సమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిఫా నిర్వాహకులపైనే సంచలన ఆరోపణలు చేశారు.

వివరాలు

ఓటమికి ప్రధాన కారణం అదే..

హోస్సమ్ మాట్లాడుతూ.. "అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో మేమే మెరుగైన ఆటతీరు కనబర్చాం. అయినప్పటికీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు. మా ఓటమికి ప్రధాన కారణం మైదానంలో జరిగిన ఆట కాదని, దాని వెనుక ఉన్న ఇతర అంశాలేనని భావిస్తున్నాం. అర్జెంటీనా జట్టును, ముఖ్యంగా మెస్సిని టోర్నీలో చివరి వరకు కొనసాగించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు వ్యవహరించినట్లు అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

వివరాలు

హోస్సమ్ తీవ్ర వ్యాఖ్యలు..

"ఆ రిఫరీ నియామకాన్నే మేము మొదటి నుంచే వ్యతిరేకించాం. అయినప్పటికీ మా అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోలేదు. మ్యాచ్‌లో ఫెయిర్ ప్లే కనిపించలేదు. సరైన పరిశీలన లేకుండానే మా గోల్‌ను ఫౌల్‌గా ప్రకటించారు. మా ఆటగాడిని అర్జెంటీనాకు చెందిన మాక్ వెనక్కి లాగిన విషయం అందరికీ స్పష్టంగా కనిపించింది. కానీ ఆ ఘటనను వీఏఆర్‌లో సమగ్రంగా పరిశీలించలేదు. తీసుకున్న నిర్ణయాలు అన్నీ అసంబద్ధంగా అనిపించాయి. అదృష్టం మా వైపు లేకపోయినా, అంతకుముందే మాపై అన్యాయం జరిగిందనేది వాస్తవం. ఈ మ్యాచ్‌లో మేము మోసపోయాం" అని హోస్సమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వివరాలు

'టోర్నీ ముందే ఫిక్స్ అయినట్లుంది'.. జికో ఆరోపణలు..

ఈజిప్ట్ ఆటగాడు మోస్తాఫా జికో కూడా మ్యాచ్ అనంతరం నిర్వాహకుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనా జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అదే సమయంలో టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు. "రిఫరీ వ్యవహరించిన తీరు అత్యంత నిరాశ కలిగించింది. దేవుడు మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, రిఫరీ మాత్రం ఒక్కటిని కూడా సక్రమంగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వలేదు. జట్టు మొత్తం చేసిన శ్రమను ఆయన నిర్ణయాలు వృథా చేశాయి. చివరికి ఈ ప్రపంచకప్‌ను అర్జెంటీనానే గెలుస్తుంది. ఎందుకంటే కప్పు వారికే అందించాలనే నిర్ణయం ముందే తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. మేము 2-0తో గెలవాల్సిన మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. మొత్తం టోర్నీ ఫిక్స్ చేసినట్లే కనిపిస్తోంది" అంటూ జికో సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement