INDW vs ENGW: ఇంగ్లాండ్‌పై పట్టు బిగించిన భారత మహిళల జట్టు.. 269 పరుగుల ఆధిక్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యాన్ని 269 పరుగులకు పెంచుకుంది. భారత్ తరఫున ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో 124 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెతో కలిసి యస్తికా భాటియా 73 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజ్‌లో కొనసాగుతోంది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 33 పరుగులు చేసి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఔటైంది.
వివరాలు
తొలి ఇన్నింగ్స్ సాగిందిలా..
అంతకుముందు 21/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో అమీ జోన్స్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నాట్ సీవర్-బ్రంట్ 44 పరుగులు చేసింది. ఓపెనర్ మైయా బౌచియర్ 23 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు (5/37) పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. సయాలి సత్ఘరే రెండు వికెట్లు, స్నేహ్ రాణా రెండు వికెట్లు దక్కించుకోగా, దీప్తి శర్మ ఒక వికెట్ సాధించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు 285 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.