Khelo india youth games 2026 : తెలంగాణ వేదికగా 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'.. 4 నగరాల్లో పోటీలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన క్రీడా సదుపాయాలు, అవసరమైన ప్రోత్సాహం అందించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. యువ క్రీడాకారుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టడంతోపాటు.. క్రీడా రంగంలో వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు గత 12 ఏళ్లుగా పలు కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోంది. 'ఖేలో ఇండియా' కార్యక్రమంలో భాగంగా దేశంలోని యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది.
వివరాలు
8వ ఎడిషన్ 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'కు తెలంగాణ ఆతిథ్యం..
'ఖేలో ఇండియా యూత్ గేమ్స్', 'ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్', 'ఖేలో ఇండియా పారా గేమ్స్', 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్', 'ఖేలో ఇండియా బీచ్ గేమ్స్', 'ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్', 'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్' ఉన్నాయి.
ఈ పోటీల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు తమలోని ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన 24 ఎడిషన్ల 'ఖేలో ఇండియా' పోటీల్లో దేశవ్యాప్తంగా 60 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.
తెలంగాణలో ఈ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
వివరాలు
25 క్రీడాంశాల్లో పోటీలు..
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నగరాల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.
ఈ ఎడిషన్‌లో మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఆతిథ్య రాష్ట్రంగా తెలంగాణ ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించే అవకాశం ఉంది.
దీనితోపాటు మరో కొత్త క్రీడను కూడా ఈ ఈవెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లను విడుదల చేసింది.
ఖేలో ఇండియా పథకం అడ్‌హాక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు.
వివరాలు
హర్షం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి..
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు కేటాయించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని అన్నారు. అయితే వారికి అవసరమైన క్రీడా సదుపాయాలు కల్పించడం, ప్రోత్సాహం అందించడం, ప్రతిభను వెలికితీయడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు.
గత ప్రభుత్వాలు స్పోర్ట్స్ బడ్జెట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని చెప్పారు.