India vs New Zealand 4th T20: నేడు కివీస్‌తో నాలుగో టీ20 నేడు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌పై వరుసగా మూడు విజయాలు నమోదు చేసి ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో నాలుగో టీ20కు సిద్ధమవుతోంది. అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు మంచి ఫలితాలు అందించిన విశాఖపట్నంలో బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్ సాగేకొద్దీ దూకుడు పెంచుతున్న భారత బ్యాటర్లను అడ్డుకోవడం కివీస్‌కు కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి టీమ్‌ఇండియా ప్రత్యర్థిని షాక్‌కు గురి చేసింది. నాలుగో టీ20లో భారత బ్యాటర్లను న్యూజిలాండ్ బౌలర్లు ఎంతవరకు నియంత్రించగలరో చూడాలి.
వివరాలు
అతడి ప్రదర్శనపైనే ఫోకస్
సిరీస్ మొత్తం భారత బ్యాటింగ్ అదరగొడుతున్నప్పటికీ.. ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడనే అంచనాల మధ్య..ఈ సిరీస్‌లో సంజు వరుసగా 10, 6, 0 పరుగులకే పరిమితమయ్యాడు. ఏ మ్యాచ్‌లోనూ రెండు ఓవర్లు కూడా క్రీజులో నిలబడలేకపోయాడు.కనీసం ఈ మ్యాచ్‌లో అయినా అతడు ఇన్నింగ్స్ నిలబెట్టుకుంటాడని జట్టు ఆశిస్తోంది. ఇషాన్ కిషన్ రీఎంట్రీలో మంచి ఫామ్ చూపుతుండటంతో.. సంజు బ్యాటింగ్‌లో మార్పు లేకపోతే ప్రపంచకప్‌లో ఓపెనింగ్ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు అభిషేక్ శర్మను అడ్డుకోవడం కివీస్ బౌలర్లకు తలకుమించిన పనిగా మారింది. గత మ్యాచ్‌లో తన గురువు యువరాజ్ సింగ్‌ను తలపిస్తూ కేవలం 14బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
వివరాలు
మూడో టీ20లో అదరగొట్టిన బౌలింగ్ విభాగం
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి వచ్చి వరుసగా రెండు మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో జట్టులో ఉత్సాహం పెరిగింది. టాప్ ఆర్డరే ఎక్కువగా స్కోరు భారాన్ని మోస్తుండటంతో మిడిల్ ఆర్డర్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకు సింగ్ అవకాశాలు వచ్చినప్పుడు తమ సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువే. అయితే సిరీస్ ఇప్పటికే చేజిక్కించుకున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉండొచ్చు. అతడిని ఆడించాలంటే అభిషేక్‌కు విశ్రాంతినిచ్చి, సంజు-ఇషాన్‌లను ఓపెనింగ్‌లో పంపాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తడబడిన బౌలింగ్ విభాగం.. మూడో టీ20లో మాత్రం అదరగొట్టింది.
వివరాలు
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా బుమ్రా
బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే కాక మూడు వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకుంటాడు. గత మ్యాచ్‌లో మంచి ప్రభావం చూపిన రవి బిష్ణోయ్.. కుల్‌దీప్‌తో కలిసి స్పిన్ దాడిని కొనసాగించే అవకాశం ఉంది.
వివరాలు
కివీస్ పుంజుకుంటుందా?
వన్డే సిరీస్ గెలుపుతో ఉత్సాహంగా టీ20 సిరీస్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. వరుస పరాజయాలతో వెనుకబడింది. ముఖ్యంగా మూడో టీ20లో 150 పైచిలుకు లక్ష్యాన్ని భారత్ కేవలం పది ఓవర్లలోనే ఛేదించడం కివీస్ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసింది. అయినప్పటికీ ప్రతిభతో నిండిన ఈ జట్టును తక్కువగా అంచనా వేయలేం. టాప్ ఆర్డర్ విఫలమవడం వారిని ఇబ్బంది పెడుతోంది. కాన్వే, సీఫర్ట్, రచిన్ కలిసి బలమైన ఆరంభం ఇవ్వాలని జట్టు ఆశిస్తోంది. ఆ తర్వాత ఫిలిప్స్, మిచెల్, చాప్‌మన్, శాంట్నర్‌లతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. హెన్రీ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ విభాగం ఆరంభంలోనే భారత బ్యాటర్లపై ఒత్తిడి తేవగలిగితేనే కివీస్‌కు అవకాశాలు ఉంటాయి.
వివరాలు
బ్యాటింగ్ పిచ్
అయితే శాంట్నర్, ఇష్ సోధి వంటి స్పిన్నర్లు ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్పిన్‌కు అనుకూలించే విశాఖ పిచ్‌పై వీరిద్దరూ ఎంతవరకు రాణిస్తారో చూడాలి. విశాఖపట్నం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బుధవారం కూడా అదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. 200కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. రాత్రి వేళల్లో మంచు ప్రభావం ఉండే సూచనలు ఉన్నందున భారీ లక్ష్యాలు కూడా సురక్షితం కాదనే అభిప్రాయం ఉంది. చివరిసారిగా 2023లో ఇక్కడ జరిగిన టీ20లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. ఈ వికెట్‌పై స్పిన్నర్లకూ సహకారం లభిస్తుంది. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
వివరాలు
విశాఖలో భారత్ రికార్డు
విశాఖపట్నంలో భారత్ ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడగా.. మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి ఎదుర్కొంది. అయితే ఇక్కడ ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో టీ20ల్లో తలపడలేదు.