ISSF Junior World Championships: జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్స్‌లో ముకేశ్ సత్తా.. 5 స్వర్ణాలు, 2 కాంస్యాలతో రికార్డు
పెరూలో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలు సాధించగా, 19 ఏళ్ల ముకేశ్ ఏకంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటాడు. 10 మీటర్ల పిస్టల్ టీమ్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ విభాగాల్లో ముకేశ్ స్వర్ణ పతకాలు సాధించాడు. అంతేకాదు 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు కూడా సాధించాడు. ముకేశ్‌ది గుంటూరుకు చెందిన శ్రీనగర్ ప్రాంతం. న్యాయవాది అయిన తండ్రి శ్రీనివాసరావు, ఉపాధ్యాయురాలైన తల్లి మాధవి ప్రోత్సాహంతో ముకేశ్ షూటింగ్ కెరీర్‌లో అడుగుపెట్టాడు.
అద్భుత ప్రతిభతో దూసుకెళ్తుతున్న ముకేష్
8వ తరగతి చదువుతున్నప్పుడు వేసవి శిబిరంలో మొదటిసారి షూటింగ్ శిక్షణ తీసుకున్న ముకేశ్, అప్పటికే నెల రోజుల్లోనే జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించి, ఈ ఆటను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. గుంటూరులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ముకేశ్ పుణెలో గగన్ నారంగ్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీకి చేరి శిక్షణ కొనసాగించాడు. ఖేలో ఇండియా పథకం కింద 10 మీటర్ల విభాగంలో ఉచిత శిక్షణ పొందుతూ, 25 మీటర్ల, 50 మీటర్ల విభాగాల్లో తన సొంత ఖర్చుతో సాధన చేశాడు. కరోనా సమయంలో శిక్షణలో విఘాతం ఏర్పడినా, ముకేశ్ పుంజుకొని గొప్ప విజయాలు సాధించాడు.
ఐదు స్వర్ణాలు సాధించడం ఆనందంగా ఉంది
ముఖ్యంగా, ముకేశ్ తన లక్ష్యంగా 2028లో జరగనున్న లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం సీనియర్ విభాగంలో అర్హత సాధించడానికి కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం కె.ఎల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ముకేశ్, తన విజయాలతో భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలనే సంకల్పంతో ఉన్నాడు. దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం గెలవడం ప్రతి క్రీడాకారుడి కల అని, ఒకే టోర్నీలో ఐదు స్వర్ణాలు సాధించడం ఎంతో ప్రత్యేకమని ముకేశ్ అభిప్రాయపడ్డాడు.