PM Modi: మోదీని కలిసిన టీమ్‌ఇండియా - ప్లేయర్స్‌తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని
విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా ఈ ట్రోఫీని తీసుకుని స్వదేశానికి వచ్చిన టీమ్‌ఇండియా ప్లేయర్లు ప్రధాన మంత్రి మోదీని కలిశారు. ముందుగా వారికి దిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గరే అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం వారు ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఘన స్వాగతం దక్కింది. డప్పు శబ్దాలకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా చిందులేశారు. అనంతరం అక్కడి నుంచి భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిసేందుకు 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
మోదీ అభినందనలు
ఈ సందర్భంగా మోదీ ప్రతీ క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం కూడా చేశారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి వారంతా విమానాశ్రయానికి బయలు దేరారు. అక్కడి నుంచి వీరంతా నేరుగా ముంబయికి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో, ఆ తర్వాత వాంఖడే వేదికగా వీరిందరికీ సన్మానం జరగనుంది. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ రోజునే ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి ప్లేయర్లతో మాట్లాడారు. వారిని అభినందించారు. ఎందుకంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్ నెగ్గింది. చివరిగా 2003లో టీ20 వరల్డ్ కప్, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2013లో వన్డే ప్రపంచ కప్‌ను దక్కించుకుంది టీమ్‌ఇండియా.